Begin typing your search above and press return to search.

బాబుకు ముందుంది ముసళ్ల పండుగేనా?

By:  Tupaki Desk   |   30 Oct 2019 11:24 AM GMT
బాబుకు ముందుంది ముసళ్ల పండుగేనా?
X
2014లో దోస్తీ చేసుకొని ముందుకు వెళ్లిన బీజేపీ - టీడీపీలు కలిసి మూడేళ్లు కూడా కాపురం చేయలేకపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని బీజేపీ తేల్చయడం ఈ ఇద్దరి మిత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ఇక అప్పటి నుంచి చంద్రబాబులోని మరో అపరిచితుడు బయటకు వచ్చేశారు. హోదా కోసం బీజేపీ పెద్దలు ఉండే ఢిల్లీ నడిబొడ్డున దీక్షలు చేశారు. అమరావతిలోనూ ప్రజల్లో సానుభూతి కోసం పోరాడారు. కానీ కట్ చేస్తే చంద్రబాబు ఓడిపోయారు.. మోడీ గెలిచాడు..

నిజానికి చంద్రబాబు ఓడిపోగానే ఆయన పని ఖతం అనుకున్నారంతా.. మోడీషాలు వదలరని.. చంద్రబాబును జైలుకు పంపిస్తారని అంతా ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.. దేశంలో తమకు వ్యతిరేకంగా గతంలో వ్యవహరించిన చిదంబరం - డీకే శివకుమార్ సహా చాలా మందిని ఊచలు లెక్కించేలా చేసిన మోడీషా బ్యాచ్ తమపై ఎన్నికల వేళ కక్షగట్టి ప్రతిపక్షాలను కూడగట్టి నానా యాగీ చేసిన చంద్రబాబును ఎందుకు వదిలిపెట్టారో.. జైలుకు ఎందుకు పంపలేదన్నది వారి ప్రత్యర్థులకు కూడా అంతుబట్టని మిలియన్ డాలర్ల ప్రశ్న.

చంద్రబాబు ఓడిపోయాక బీజేపీ విషయంలో అణిగిమణిగి ఉంటున్నారు. తన నలుగురు ఎంపీలను కూడా బీజేపీలోకి సాగనంపారన్న ప్రచారం ఉంది. బీజేపీకి బాబు సాగిలపడి రాజీ కుదర్చుకున్నారన్న ప్రచారం లేకపోలేదు..

చంద్రబాబు ఓడిపోగానే ఏపీలో ఆయన పని అయిపోయిందని.. మొత్తం టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకొని ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తున్న ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలు సవాళ్లు కూడా చేశారు. ఎందుకో తర్వాత వారి మాటలకు ఫుల్ స్టాప్ పడింది.

తాజాగా రాబోయే రోజుల్లోనే ఏపీలో టీడీపీ నుంచి మరిన్ని వలసలు ఉండబోతున్నాయని బుధవారం విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయ ప్రారంభం సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హాట్ కామెంట్ చేశారు. టీడీపీ నుంచి వలసనలు ఆపేందుకునే బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహ లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీతో పొత్తు ఉండదని.. టీడీపీని లేకుండా చేసి ఏపీలో ప్రతిపక్షంగా ఎదుగుతామని రామ్ మాధవ్ చెప్పకొచ్చాడు.

మరి రామ్ మాధవ్ పలికిన ఈ మాట అయినా ఖచ్చితంగా అమలు అవుతుందా.? నేతి బీరకాయ చందంగా మళ్లీ టీడీపీపై చర్యలకు బీజేపీ వెనుకాడుతుందా తెలియాలంటే మరిన్ని రోజులు వేచిచూడాల్సిందే.