Begin typing your search above and press return to search.

పట్టువదలని విక్రమార్కుడు 'టీ సర్కారు'కు షాక్‌ ఇస్తారా?

By:  Tupaki Desk   |   20 March 2015 7:32 AM GMT
పట్టువదలని విక్రమార్కుడు టీ సర్కారుకు షాక్‌ ఇస్తారా?
X
మహబూబ్‌నగర్‌.. హైదరాబాద్‌.. రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మరోసారి పోటీ చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా బీజేపీ పార్టీ నేతగా సుపరిచితులైన ఆయన.. పట్టభద్రుల స్థానం నుంచి మండలికి ఎన్నిక కావాలన్న లక్ష్యంతో ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలు కావటం.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న ధృడ సంకల్పంతో ఆయన ముందుకెళుతున్నారు. ఆయన ప్రత్యర్థిగా ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌ బరిలో ఉన్నారు. మండలిలో చోటు కోసం పట్టువదలని విక్రమార్కుడి మాదిరి పోరాడుతున్న ఆయనపై సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంది.

ఎంత కష్టపడినా.. చివర్లో కొద్దిపాటి తేడాతో ఓటమి పాలు కావటం.. రామచంద్రరావు ముఖం చిన్నబోవటం పట్టభద్రులకు బాగానే గుర్తుండి ఉంటుంది. అందుకేనేమో.. ఈసారి ఆయన రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ కాదన్నట్లుగా ఆయన కష్టపడుతున్నారు.

నిజానికి ఆయన చేస్తున్న ప్రచారం ధాటికి తెలంగాణ అధికారపక్షం సైతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రామచంద్రరావు కానీ గెలిస్తే అదో సంచలనం. అదే సమయంలో తెలంగాణ అధికారపక్షానికి ఆ ఫలితం ఓ షాక్‌ కావటం ఖాయం. ఈ నేపథ్యంలో బీజేపీ.. టీడీపీ వర్గాలు మొత్తం తమ శక్తియుక్తుల్ని రామచంద్రరావును గెలిపించే అంశంపై దృష్టి పెడుతున్నాయి.

మరోవైపు రామచంద్రరావు.. ఇప్పటివరకూ ఎప్పుడు లేనంత ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారు. తన గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తన ప్రత్యర్థి ఉద్యోగ సంఘాల నేతే అయినప్పటికీ తన గెలుపు ఖాయమంటున్నారు.

దానికి ఆయన చెబుతున్న వాదన ఏమిటంటే.. ''వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్‌ అధికారులు.. ప్రైవేలు.. ప్రభుత్వ లెక్చరర్లు.. వివిధ రంగాల్లో పని చేసిన ఉపాధ్యాయులు.. టీఎన్జీవోలు కీలకభూమి పోషించారు. కానీ.. టీఆర్‌ఎస్‌ అధికారపక్షంగా అవతరించిన తర్వాత మాత్రం టీఎన్జీవోలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. మిగిలిన అన్ని వర్గాలను విస్మరించింది. దీనిపై ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. అంతేకాదు.. నిరుద్యోగ విద్యార్థులు సైతం తెలంగాణ సర్కారు మీద చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి ఆశలు అడియాశలయ్యాయి. అందుకే మా గెలుపు ఖాయం'' అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ రామచంద్రరావు గెలిస్తే మాత్రం తెలంగాణ అధికారపక్షానికి అదో పెద్ద షాక్‌ అని చెబుతున్నారు