Begin typing your search above and press return to search.

‘పవన్ నిజాలు’ వెర్సెస్ ‘కమల నిజాలు’

By:  Tupaki Desk   |   19 Feb 2018 11:57 AM GMT
‘పవన్ నిజాలు’ వెర్సెస్ ‘కమల నిజాలు’
X
నిజం అంటే ఏమిటి? నిజం అంటే నిజమే.. దానికి రెండో అర్థం ఉండదు. కానీ ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి రెండు నిజాలు వెల్లడి కాబోతున్నాయి. ఇప్పటికే అన్యాయం ఎక్కడ జరుగుతోంది. తెదేపా - భాజపాల్లో ఎవరు అబద్ధాలు చెబుతున్నారో నిజాలు తేల్చడానికి పవన్ కల్యాణ్ ఒక కమిటీ ఏర్పాటుచేసి కసరత్తు చేస్తున్నారు. అయితే నిజాలు తేల్చగలిగింది పవన్ ఒక్కడేనా? మేం కూడా నిజాలు తేలుస్తాం.. అంటూ ఇప్పుడు భాజపా రంగంలోకి దిగింది. పవన్ ఒక్కడే కమిటీలు వేయగలడా.. మాకు చేతకాదా అంటున్నట్లుగా పార్టీ తరఫున ఒక కమిటీని కూడా నియమించేసి.. వ్యవహారాన్ని అధ్యయనం చేసి.... నిజాలు తేల్చాలంటూ పురమాయించింది.

అయినా ఇక్కడ పవన్ కల్యాణ్ తన రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేదని ముందుగానే ప్రకటించి.. ఇది తటస్థ కమిటీ అన్నట్లుగా దానికి ఓ కలర్ ఇచ్చి - రాజకీయాలతో సంబంధం లేనివారినే ఎక్కువ మందిని కీల భాగస్వాముల్ని చేసి.. తన నిజాలు తేల్చే కసరత్తును ప్రారంభించారు. కాకపోతే.. కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలిసిపోతుందని అన్నట్లుగా.. ఆ పవన్ కమిటీ ఎలాంటి నిజాలను బయటపెట్టబోతున్నదో.. ఎవరి మీద నిందలు వేయబోతున్నదో భాజపాకు ముందే అర్థమైపోయినట్లుంది.

పవన్ కమిటీకి చంద్రబాబునాయుడు రాష్ట్రప్రభుత్వం తరఫున రిపోర్టును కూడా పంపించి చాలా బాగా సహకారం అందిస్తున్నారు. పైగా పవన్ మనోడే.. ఆయన అధ్యయనం గురించి మనకేమీ చింత అక్కర్లేదు.. అని ఆయన బహిరంగంగా పార్టీ శ్రేణులకు భరోసా కూడా ఇచ్చారు. మరోవైపు కేంద్రాన్ని కూడా పవన్ వివరాలు కోరినప్పటికీ వారు తూచ్ అన్నారు. పవన్ ను అసలు ఖాతరు చేయలేదు. పైగా రెండు రోజుల భేటీ తర్వాత.. కమిటీవారి ప్రసంగాల్లో లోపాలు కేంద్రం వద్దనే ఎక్కువగా ఉన్నాయనే మాట సూచనమాత్రంగా వెల్లడైంది కూడా! ఈ నేపథ్యంలోనే సరైన రీతిలో పవన్ కు కౌంటర్ ఇవ్వాలంటే నిజాలు తేలుస్తాం అంటూ తాముకూడా కమిటీ రూపంలో రంగంలోకి దిగాలని భాజపా అనుకున్నట్లుంది.

అయినా ఏదో పోటీకోసం చేస్తున్నట్లుగా ఉంది కానీ, హరిబాబు తొలుత ఇచ్చిన 27 పేజీల నివేదిక - ఆ తర్వాతి 11 పేజీల నివేదిక కాకుండా.. ఇంకా ఏం నిజాలు తేలుస్తారు వీళ్లు అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.