Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు ఏపీ బీజేపీ నేత బాబుపై ఫైర్ అయ్యారు

By:  Tupaki Desk   |   20 Aug 2016 10:04 AM GMT
ఇన్నాళ్లకు ఏపీ బీజేపీ నేత బాబుపై ఫైర్ అయ్యారు
X
ఏపీ బీజేపీ నేతలు పరిస్థితి త్రిశంక స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది. మొన్నటి వరకూ సమయం వచ్చిన ప్రతిసారీ మిత్రపక్షం అన్నది కూడా చూడకుండా ఏపీ సర్కారుపై బీజేపీ నేతలు విరుచుకుపడే వారు. ఎప్పుడైతే ఏపీకి ప్రత్యేక హోదా మీద కేంద్రం క్లారిటీ ఇవ్వటం మొదలైందో.. నాటి నుంచి ఏపీ బీజేపీ నేతలు నోటికి తాళాలు పడిపోయిన పరిస్థితి. అప్పటి నుంచి వారు నోరు విప్పేందుకు సైతం ధైర్యం చేయటం లేదు. ఏం మాట్లాడినా.. జనం సంగతి తర్వాత ఏపీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దిక్కులు చూసే పరిస్థితి.

అందుకే.. వారు కొద్ది నెలలుగా మౌనంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ.. ఏపీ బీజేపీ నేత సురేష్ రెడ్డి గొంతు విప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై గురి పెట్టిన ఆయన.. పలు అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఢిల్లీలో బీజేపీ నేతల్ని పొగుడుతున్న చంద్రబాబు ఏపీలో మాత్రం వారిని తిడుతున్నారని.. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు కుట్ర చేస్తున్నారా? అన్న సందేహం కలుగుతుందని వ్యాఖ్యానించారు.
2019లో మోడీ తిరిగి పవర్ లోకి రాకుండా ఉండేలా ఏపీలో కుట్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి రూ.1.45 లక్షల కోట్లు ఏపీకి ఇచ్చినట్లు కేంద్రమంత్రి చెబితే చప్పట్లు కొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. సురేష్ రెడ్డి ప్రశ్నల్నే తీసుకుంటే.. కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. కేంద్రమంత్రి రూ.1.45 లక్షల కోట్లు ఇచ్చినట్లు చెప్పినా.. తర్వాతి కాలంలో ఏపీకి వచ్చింది ఇంతమాత్రమే అని లెక్కలు చెప్పిన వైనాన్ని ఎందుకు మర్చిపోతున్నారు.

నిన్నటికి నిన్న జాతీయ మీడయాను ప్రత్యేకంగా విజయవాడకు పిలిపించి మరీ ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి వివరించి.. కేంద్రం ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని చెప్పిన విషయాన్ని ఏపీ బీజేపీ నేత ఎందుకు మర్చిపోయినట్లు? అయినా.. ఏపీ ప్రజల కోసం పని చేసే కమలనాథులు.. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ఇప్పటివరకూ బలంగా గళాన్ని వినిపించింది లేదు. పార్టీ మీద అభిమానం ఉన్నా.. ప్రజలు ఓట్లు వేస్తే మాత్రమే పవర్ వస్తుందన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మర్చిపోతున్నారు? తామెంతో విధేయతతో వ్యవహరించే తమ అధినాయకత్వం.. తాము ప్రాతినిధ్యం వహించే ఏపీకి ఎందుకు సాయం చేయటం లేదన్న విషయాన్ని పార్టీ వేదికల మీద సైతం ఎందుకు ప్రశ్నించటం లేదు? సొంత ప్రజల కంటే కూడా పార్టీనే ముఖ్యమా అన్న విషయాన్ని ఏపీ బీజేపీ నాయకులు తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్న బాబు మీద విమర్శలు చేసే బీజేపీ నేతలు ముందుగా గుర్తిస్తే మంచిది.