Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌.. కూర‌లో మ‌సాలా లాంటోడు: బీజేపీ నేత కామెంట్స్‌

By:  Tupaki Desk   |   13 April 2022 4:30 PM GMT
ప‌వ‌న్‌.. కూర‌లో మ‌సాలా లాంటోడు:  బీజేపీ నేత కామెంట్స్‌
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా మొగ్గు చూపుతున్న విష‌యం చ‌ర్చ‌గా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. బీజేపీ మాత్రం జనసేన తన రాజకీయ మిత్రపక్షమని ప‌దే ప‌దే చెబుతోంంది. నిజానికి, ప్రజలను ఆకర్షించి బీజేపీకి విజయాన్ని అందించగల చరిష్మా ఉన్నందున, పవన్ కళ్యాణ్ లేకుండా ఏపీలో కొన్ని సీట్లు కూడా గెలవలేమని బీజేపీ అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు.. ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్క‌డ టీడీపీతో క‌లిసిపోతాడో .. అని భ‌య‌ప‌డుతున్నారా? అన్న‌ట్టుగా వారు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. తాజాగా కర్నూ లు జిల్లాకు చెందిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్‌ మాట్లాడుతూ.. “రుచికరమైన కారంగా ఉండే కూర వండాలంటే దానికి కాస్త మసాలా వేయాలి. ప్రజలను ఆకర్షించే బీజేపీ కూరకు పవన్ కళ్యాణ్ అలాంటి మసాలా” అని అన్నారు.

వెంకటేష్ కూడా టీడీసీ నుండి బిజెపిలోకి ఫిరాయించిన నాయ‌కుడే. 2014 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎలా సహకరించాడో ఆయ‌న‌కు బాగా తెలుసు. టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మసాలా కూరను అందించాలనుకుంటే, ఈ పార్టీకి మళ్లీ పవన్ కళ్యాణ్ అవసరం అవుతుంద‌నేది ప‌రిశీల‌కులు మాట‌. ఇదిలావుండగా, బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ కూడా పవన్ కళ్యాణ్ బిజెపి కూటమి భాగస్వామిగా కొనసాగుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ మద్దతుతో బీజేపీ-జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.

బీసీని సీఎం చేయ‌గ‌ల‌రా?

ఇక‌, బీజేపీ మ‌రో నేత‌.. ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్‌ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు మంత్రి పదవులు కాదు.. సీఎంను చేయగలరా? అని సీఎం జగన్‌ను జీవీఎల్ ప్రశ్నించారు. బీసీలకు 10 మంత్రి పదవులు ఇస్తే అభివృద్ధి చెందుతారా? అని జీవీఎల్‌ అన్నారు. ఎవరూ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ స్పష్టం చేశారు. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల కాలంలో వైసీపీలో అసంతృప్తులు పెర‌గ‌డమేన‌ని.. బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.