Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిస్టుల‌కు బీజేపీ నేత వార్నింగ్!

By:  Tupaki Desk   |   23 Jun 2018 5:20 PM GMT
జ‌ర్న‌లిస్టుల‌కు బీజేపీ నేత వార్నింగ్!
X
కొంతకాలంగా త‌మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో అధిష్టానానికి బీజేపీ నేత‌లు త‌లనొప్పులు తెచ్చిపెడుతోన్న సంగ‌తి తెలిసిందే. నిరుద్యోగుల‌పై త్రిపుర సీఎం బిప్ల‌వ్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు మొదలుకొని.....ముస్లింల‌ను త‌న కార్యాలయంలోకి రానివ్వ‌నని క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర ఎమ్మెల్యే బ‌స‌వ‌గౌడ పాటిల్ చేసిన వ్యాఖ్య‌ల వ‌ర‌కూ ఆ ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని స్వ‌యంగా స్పందించి చుర‌క‌లంటించినా బీజేపీ నేత‌ల తీరు మార‌క‌పోగా....ఆ త‌రహా విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. నిత్యం ఏవో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లతో వార్త‌ల్లో నిల‌వ‌డం బీజేపీ నేత‌ల‌కు నిత్య‌కృత్య‌మైంది. తాజాగా - జ‌ర్నలిస్టుల‌పై జ‌మ్మూ క‌శ్మీర్ కు చెందిన‌ మాజీ కేంద్ర మంత్రి లాల్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి. వార్త‌లు రాసే ముందు జ‌ర్న‌లిస్టులు హ‌ద్దులు దాటొద్ద‌ని వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌స్తుతం స‌ద‌రు మంత్రిగారు చేసిన వ్యాఖ్య‌ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

జ‌మ్మూ క‌శ్మీర్ లోనీ పీడీపీతో బీజేపీ తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా - ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జ‌ర్న‌లిస్టుల‌పై లాల్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము రాసే వార్తలకు జ‌ర్న‌లిస్టులు కొన్ని ప‌రిమితులు పెట్టుకోవాల‌ని - అలా రాయ‌ని ప‌క్షంలో వెటరన్‌ జర్నలిస్టు షుజాత్‌ బుఖారీకి ప‌ట్టిన గ‌తే వారికీ ప‌డుతుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. షుజాత్ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని జ‌ర్న‌లిస్టులు ఎలా బ్ర‌త‌కాలో నిర్ణ‌యించుకోవాల‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. జ‌మ్మూ క‌శ్మీర్ లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు షుజాత్ ....వారం క్రితం దారుణ హత్యకు గురైన విష‌యం తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే లాల్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే - లాల్‌ సింగ్‌ నోటి దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఇది రెండోసారి. కథువాలో చిన్నారి ఆసిఫా ఉదంతంలో నిందితుల‌ తరఫున జరిగిన ర్యాలీలో లాల్‌ సింగ్‌ పాల్గొని వారికి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ నేప‌థ్యంలో విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డం - లాల్ సింగ్ కు వ్య‌తిరేకంగా జ‌ర్న‌లిస్టులు క‌థ‌నాలు వెలువ‌రించ‌డంతో ఆయ‌న కేంద్రమంత్రి ప‌ద‌వి ఊడింది. దీంతో, త‌న ప‌ద‌వి పోవ‌డానికి కార‌ణ‌మైన జ‌ర్న‌లిస్టుల‌పై అక్క‌సు పెంచుకున్న లాల్ సింగ్ ఆ వ్యాఖ్య‌లు చేశారు. అయితే, తాజాగా లాల్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గానూ ఆయ‌నపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ ఎన్ ఎన్‌ వోహ్రాను కోరేందుకు కశ్మీర్‌ జర్నలిస్టులు సిద్ధ‌మ‌వుతున్నారు.