Begin typing your search above and press return to search.

బాబు కొత్త ప్ర‌చారంతో బీజేపీకి మండిపోయింది

By:  Tupaki Desk   |   6 March 2018 9:54 AM GMT
బాబు కొత్త ప్ర‌చారంతో బీజేపీకి మండిపోయింది
X
ఇప్పటికే ఉప్పు-నిప్పులా ఉన్న టీడీపీ-బీజేపీ సంబంధాలపై తాజాగా వెలసిన ఫ్లెక్సీలు మరింత దెబ్బతీసేలా మారాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు త‌మ‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు వాపోతున్నారు. టీడీపీ ఒక వ్యూహం ప్రకారం తమ పార్టీని రాజకీయంగా దెబ్బతీసే కుట్రతో వెళుతోందని - ఒకవైపు త‌మ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా జోక్యంతో ఢిల్లీలో జైట్లీతో ఆర్థికమంత్రి యనమల - టీడీపీ ఎంపీల సమావేశం జరుగుతుంటే - ఇంకోవైపు ఇలాంటి ఫ్లైక్సీలు ఏర్పాటుచేయడం వల్ల టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టమవుతోందని బీజేపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.

టీడీపీ నేత కాట్రగడ్డ బాబు పేరిట విజయవాడ నగరం - శాసనసభ సమీపంలోని వెలగపూడి - ఉండవల్లి గ్రామాల్లో వెలసిన భారీ ఫ్లెక్సీలపై బీజేపీ ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలు విరుచుకుపడుతున్నారు. `మోడీ గారూ ఆంధ్రప్రదేశ్‌ పై వివక్ష ఎందుకు? రాష్ట్ర బీజేపీ నేతల్లారా ప్రజల పక్షాన నిలబడండి. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని అడ్డంగా విభజిస్తే ఇప్పుడు మీరు కూడా ఏపీకి నష్టం కలిగించేలా వ్యవహరించడం సరికాదు. ఆర్థిక ఇబ్బందులున్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. అర్థం చేసుకుని ఆయనకు సహరించాలం’ అంటూ స‌ద‌రు నేత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని గమనించిన పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోని బీజేపీఎల్పీ ఆఫీసులో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని నేరుగా సీఎం చంద్రబాబుతోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. తాము కూడా అందుకు ప్రతిగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనిపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఇది టీడీపీ పార్టీ వైఖరా? వ్యక్తిగతమో తేల్చాలి. ముళ్లపూడి రేణుక కూడా అభ్యంతరకరంగా మాట్లాడారు. టీడీపీ వైఖరి పొమ్మనలేక పొగపెట్టినట్టే ఉందన్నారు. ఒకవేళ ఫ్లైక్సీల వ్యవహారం నేతల వ్యక్తిగతమైతే అవి ఏర్పాటుచేసిన నేతను సస్పెండ్ చేయాలన్న డిమాండును లేవనెత్తాలన్నారు.

సమావేశానంతరం బీజేపీఎల్పీ నేత విష్ణుకుమార్‌ రాజు - మాధవ్ - సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటున్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు స్పందించి - వాస్తవాలు తెలుసుకుని కార్యాచరణ కోసం మీవారిని పంపించాలని సీఎంకు తమ పార్టీ అధినేత అమిత్‌ షా ఫోన్ చేస్తే - దానిని కూడా వక్రీకరించి బాబుకు భయపడి అమిత్‌ షా ఫోన్ చేశారనడం దారుణమని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై ఆ పార్టీ నాయకత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని - అది నేతల సొంత అభిప్రాయమా? లేక పార్టీ వైఖరా అన్నది వెల్లడించాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ ఏర్పాటుచేసిన కమిటీ రూపొందించిన నివేదిక పరిశీలించిన తర్వాతే స్పందిస్తామన్నారు.