Begin typing your search above and press return to search.

గుజరాత్ లో ఆటోలో వెళ్లిన క్రేజీవాల్ కు బీజేపీ బహుమతేంటో తెలుసా?

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:30 AM GMT
గుజరాత్ లో ఆటోలో వెళ్లిన క్రేజీవాల్ కు బీజేపీ బహుమతేంటో తెలుసా?
X
ఢిల్లీ పీఠాన్ని కైవశం చేసుకున్న ఆమ్ ఆద్మీ చీఫ్.. ఆ తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పంజాబ్ లో అధికారాన్ని సొంతం చేసుకోవటానికి ఆయన చేసిన ప్లానింగ్ గురించి అందరికి తెలిసిందే. అనుకున్నట్లే ఢిల్లీ తర్వాత ఆయన టార్గెట్ చేసిన పంజాబ్ ను సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు ఫోకస్ అంతా గుజరాత్ మీద పెడుతున్నారు.

గడిచిన కొన్ని దఫాలుగా గుజరాత్ లో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన బీజేపీకి.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షాకిచ్చేందుకు వీలుగా కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు. మిగిలిన పార్టీ అధినేతల మాదిరి కాకుండా.. సింఫుల్ గా.. సాదాసీదాగా ఉంటూ తనకు మించిన ఆదర్శనేత మరెవరూ ఉండరన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.

ఇప్పుడు అదే విధానాన్ని గుజరాత్ ప్రజలకు పరిచయం చేసేందుకు ఆయన తపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్యనే ఆయన ఒక ఆటో డ్రైవర్ ఇంటికి అతడి ఆటోలోనే ప్రయాణించి వెళ్లారు. ఈ ఎపిసోడ్ లో గుజరాత్ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే.. గుజరాత్ పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన వరకు ఆయన ఆటోలో వెళ్లటం ఓకే. కానీ.. భద్రతాపరమైన ఇబ్బందుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతూ ఆటోను ఆపారు.

అయితే.. తనకు భద్రత అవసరం లేదని.. తనను వెళ్లనివ్వాలని కోరుతూ కేజ్రీవాల్ ప్రయాణించే ఆటోకు పోలీసులు అడ్డుకున్నారు. మొత్తంగా ఆ ఎపిసోడ్ లో కేజ్రీవాల్ తానుఅనుకున్నట్లే ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి భోజనం చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ.. అతడు పెద్ద నటుడుగా అభివర్ణించారు. అక్కడితో ఆగని బీజేపీ నేతలు తాజాగా మరో ఆసక్తికర చర్యకు తెర తీశారు.

ఢిల్లీలోని కేజ్రీవాల్ కాన్వాయ్ లో సాధారణంగా 27 వాహనాలు ఉండటం.. మొత్తం 200 మంది భద్రతా సిబ్బందితో ఉన్నప్పటికీ.. గుజరాత్ లో సాదాసీదాగా వ్యవహరిస్తూ ఆటోలో వెళ్లిన వైనంపై బీజేపీ అనూహ్యంగా రియాక్టు అయ్యింది. ఢిల్లీలోని ఆయన నివాసానికి ఐదు ఆటోల్ని తీసుకెళ్లి బహుమతిగా ఇస్తున్నట్లుగా పేర్కొంది.

ఒక ఆటో పైలెట్ గా పని చేస్తుందని.. ఇంకోటి ఆయన కోసమని.. మరో రెండు భద్రతా సిబ్బంది కోసమని.. ఐదో ఆటో ఆయన ప్రైవేటు సెక్రటరీ కోసమంటూ ఎత్తిపొడుపు వ్యాఖ్యలతో వ్యవహరించారు. గుజరాత్ లో ఆటోలో ప్రయాణించేందుకు అంత ప్రాధాన్యత ఇచ్చిన కేజ్రీవాల్.. ఢిల్లీలో ఐదు ఆటోల్లో ప్రయాణించాలంటూ బీజేపీ వారు తీసుకెళ్లిన ఆటోలకు కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.