Begin typing your search above and press return to search.

బీజేపీకి అవసరం లేనిది షర్మిలకే ఎందుకు ?

By:  Tupaki Desk   |   8 Oct 2022 6:39 AM GMT
బీజేపీకి అవసరం లేనిది షర్మిలకే ఎందుకు ?
X
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేయటం కోసమే షర్మిల ఢిల్లీకి వెళ్ళి సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైస్వాల్ ను కలవటం గమనార్హం. షర్మిల ఆరోపణల్లో నిజమెంత ? ఆధారాలంటు ఆమె అందించిన డాక్యుమెంట్లలో వాస్తవమెంత అన్నది దర్యాప్తు చేస్తే కానీ బయటపడదు. అయితే కేసీయార్ పై ఫిర్యాదు చేయటానికి పనిగట్టుకుని షర్మిల ఢిల్లీకి వెళ్ళటమే ఆశ్చర్యంగా ఉంది.

కేసీయార్ తో పాటు ఆయన కుటుంబం మీద బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే చిన్నా చితకా పార్టీలు కూడా ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నాయి. అయితే అవేవీ ఢిల్లీకి వెళ్ళి సీబీఐ డైరెక్టర్ ను కలిసి విచారణ డిమాండుతో ఫిర్యాదు చేయలేదు.

నిజానికి కేసీయార్ అవినీతిని బయటపెట్టాలనే బలమైన కోరిక బీజేపీలోనే ఉండాలి. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అని నానా గోల చేస్తున్నారు కాబట్టే.

కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేస్తున్నా సీబీఐకి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. అదే బీజేపీ ఆరోపణలకు పరిమితం కాకుండా ఫిర్యాదుచేసుంటే ఈ పాటికే సీబీఐ విచారణ మొదలయ్యేదే.

ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ నాయకత్వంలోని కూటమే కాబట్టి. కేసీయార్ +ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై విచారణ చేయించటం బీజేపీకి చాలా తేలికైన పని.

అయితే విచారణ చేయించే విషయం వదిలేసి ఎంతకాలమైనా కేవలం ఆరోపణలకు మాత్రమే ఎందుకు పరిమితమవుతోంది ? తెలంగాణా రాజకీయాల్లోకి ఈ మధ్యనే ప్రవేశించిన షర్మిల మాత్రం ఆరోపణలతో సరిపెట్టుకోకుండా సీబీఐని కలిసి ఫిర్యాదు చేయటం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ మొదలైంది. షర్మిల ఫిర్యాదు వెనుక బీజేపీ పెద్దలే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరి నిజమేమిటో కాలమే చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.