Begin typing your search above and press return to search.

వారిపై అనర్హత.. బీజేపీ నేతలు హ్యాపీ!

By:  Tupaki Desk   |   4 Aug 2019 1:30 AM GMT
వారిపై అనర్హత.. బీజేపీ నేతలు హ్యాపీ!
X
కర్ణాటకలో రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా సొంత పార్టీ వీడి బీజేపీలో చేరేందుకు కూడా దారులన్నీ మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. మూకుమ్మడిగా అనర్హత వేటు పడడంతో రెబెల్స్‌ సందిగ్ధంలో పడిపోయారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రుల పదవులు ఊరిస్తూ ఉండగా ఇలా జరిగిందేంటని కంగుతిన్నారు.

అసంతప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు మారిపోయే అవకాశాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబెల్స్‌ కు కేబినెట్‌ లో చోటు కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో వారిపై అనర్హత వేటు వేయడంతో పదవులు దక్కడం అనుమానమే అని చెప్పవచ్చు. ఈ పరిణామం అధికార బీజేపీ ఎమ్మెల్యేల్లో సంతోషాన్ని నింపింది. అంతేకాకుండా ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే 17కు గానూ 10 సీట్లలో గెలుపు జెండా ఎగుర వేస్తామని బీజేపీ పెద్దలు ధీమాగా ఉన్నారు. కాగా సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తే మంత్రి పదవులను డిమాండ్‌ చేసేందుకు అవకాశం ఉందని రెబెల్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యతిరేకంగా వస్తే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి.

అనర్హతకు గురైన రెబెల్‌ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. దురాశకు వెళ్లి ఉన్న పదవులు పోగొట్టుకునే స్థితికి వచ్చారు. సంకీర్ణ ప్రభుత్వంలోని స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ అనర్హత వేటు వేయడంతో 2023 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు కోసం అసంతృప్త ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. అనుకూలంగా వస్తుందో.. ప్రతికూలంగా వస్తుందోనని టెన్షన్‌ లో పడ్డారు. పార్టీలు మారితే పదవులు దక్కుతాయనే ఆశతో ఉన్న రెబెల్స్‌ కు అప్పటి స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ చుక్కలు చూపించారు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఆపరేషన్‌ కమల ద్వారా ఆఫర్ల వర్షం కురిపించడంతో ఆ పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమై నిండా మునిగారు.

సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాగూ మంత్రి పదవి దక్కేలా లేదు.. బీజేపీలోకి వెళితే అక్కడన్నా మంత్రి పదవులు దక్కుతాయనే ఆశతో రాజీనామా డ్రామాలకు తెరలేపారు. అయితే బీజేపీలో మంత్రి పదవి దేవుడికెరుక.. పార్టీలోకి చేర్చుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అనర్హత వేటు వేయక ముందే తాము రాజీనామా చేశామని.. రాజీనామా ఆమోదించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ చేశారు. అంతేకాకుండా విప్‌ జారీ చేసినప్పటికీ తాము వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.