Begin typing your search above and press return to search.

కేసీఆర్ దెబ్బకు బీజేపీ నేతలకు 'జుట్టు' కష్టాలు!

By:  Tupaki Desk   |   15 Feb 2022 5:00 AM GMT
కేసీఆర్ దెబ్బకు బీజేపీ నేతలకు జుట్టు కష్టాలు!
X
ఏపీ బీజేపీ నేతలకు ఇప్పుడు జుట్టు కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ కు ఇప్పుడు బీజేపీ నేతలకు ఈ కొత్త ఇబ్బందులు దాపురించాయి.. కొత్త విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ నాయీ బ్రాహ్మణులకు ఇస్తున్న సబ్సిడీ కట్ అయిపోతుందని ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్లలో గళమెత్తారు. దీంతో బీజేపీ పని పట్టాలని నాయీ బ్రాహ్మణులు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరి వల్ల కులవృత్తులకు ముప్పు ఏర్పడిందని.. విద్యుత్ సంస్కరణల పేరిట తమ కుడుపు కొట్టేందుకు కేంద్రం పూనుకుందని రాష్ట్ర రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రప్రభుత్వం తమకు అమలు చేస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కేంద్రం వైఖరి వల్ల రద్దయ్యే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. దీనికి నిరసనగా ఈనెల 20 నుంచి నల్లబ్యాడ్జీ లు ధరించి ఆందోళన చేస్తామని తెలిపారు.

ఈ క్రమంలోనే ఈనెల 20 నుంచి బీజేపీ నేతలకు క్షవరాలు చేయరాదని నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలు తీర్మానించారు. సోమవారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నేతృత్వంలో రజక సంఘాల నేతలు సమావేశమయ్యారు. నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నేతలంతా పాల్గొన్నారు.

నూతన విద్యుత్ చట్టం ముసాయిదాలో సబ్సిడీలు ఎత్తివేయాలని.. ఉచిత విద్యుత్ ను రద్దు చేయాలని కేంద్రం పేర్కొనడాన్ని నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఖండించారు. అది అమల్లోకి వస్తే నాయీ బ్రాహ్మణులు, రజకులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలకు ఇక తెలంగాణలో క్షవరాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు.

తెలంగాణబీజేపీ నేతలకు నాయీ బ్రాహ్మణుల సహాయ నిరాకరణతో ఇక ఇబ్బందులు తప్పేలా లేవు. వారికి గడ్డాలు, మీసాలు పెరిగితే మరి ఎవరు చేస్తారో తెలియదు.. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ రగిల్చిన మాస్టర్ స్ట్రోక్ పాపం బీజేపీ నేతలు ఇప్పుడు గడ్డాలు, మీసాలతో తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి..