Begin typing your search above and press return to search.

పాపం చంద్రబాబుది.. ఫలితం బీజేపీది

By:  Tupaki Desk   |   13 May 2016 11:58 AM GMT
పాపం చంద్రబాబుది.. ఫలితం బీజేపీది
X
ఏపీలోని టీడీపీ ప్రభుత్వ మిత్రపక్షం బీజేపీ చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. తాజాగా బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ నేతలు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలను ఆకర్షించడాన్ని తీవ్రంగా వారు వ్యతిరేకిస్తూ చంద్రబాబును తప్పు పడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్న చంద్రబాబు ఆ కారణంగా బీజేపీ నేతలతో నానా తిట్లు తింటున్నారు.

అయితే.. బీజేపీ అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఫిరాయింపులు ఎవరికోసం అన్నది ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన నిజాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షం వైసీపీని పూర్తిగా దెబ్బతీయడం.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని తిరుగులేని పార్టీగా మార్చడం లక్ష్యంగా చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండొచ్చు.. కానీ.. ఈ ఫిరాయింపుల తక్షణ ప్రయోజనం - తక్షణ ప్రతిఫలం మాత్రం బీజేపీకే దక్కబోతోందన్న విషయం మాత్రం వాస్తవం. ఆ విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించకుండా బీజేపీ నేతలు చంద్రబాబును ఘాటైన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీజేపీ నేతలు ఇంతగా విమర్శిస్తున్నా కూడా అసలు విషయం జనానికి చెప్పడంలో టీడీపీ నేతలూ విఫలమవుతున్నారు.

నిజానికి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను టీడీపీలోకి తేవడం వల్ల చంద్రబాబుకు, టీడీపీకి తక్షణ ప్రయోజనం ఏమీలేదు. వారిని తేవాలంటే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలోకి తేవొచ్చు. ఇప్పుడు వారిని తేవడం వల్ల చంద్రబాబు కొంత వరకు నష్టపోతున్నారు కూడా. వైసీపీ ఎమ్మెల్యేల చేరికల వల్ల ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న టీడీపీ నేతలు, కొత్తగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే మధ్య తగాదాలతో చంద్రబాబు తల వాచిపోతోంది. పైగా విపక్షాలతో పాటు మిత్ర పక్షం బీజేపీ నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ చంద్రబాబు వ్యక్తిగత ఇమేజి కూడా దెబ్బతింటోంది. కానీ.. వాస్తవ రాజకీయ అవసరాలు చూసుకుంటే టీడీపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వైసీపీ ఎమ్మెల్యేల అవసరం లేదు. తక్షణం వారితో ఉన్న అవసరం బీజేపీకే.

ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి - బీజేపీ నేత నిర్మలా సీతారామన్ పదవీ కాలం జూన్ 21తో ముగుస్తుంది. ఆ తరువాత మరో కేంద్ర మంత్రి - బీజేపే నేత వెంకయ్యనాయుడు పదవీకాలం కూడా జూన్ 30తో ముగియనుంది. టీడీపీకి ఎన్నికల్లో దక్కిన సీట్లతో ఇప్పుడున్న టీడీపీ రాజ్యసభ సభ్యులనో, వారి స్థానంలో కొత్తవారినో గెలిపించుకునేంత బలముంది. అదనంగా ఉన్న ఈ బీజేపీ సభ్యురాలు నిర్మలా సీతారామన్... కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించడానికి మరికొందరు ఎమ్మెల్యేలు అవసరం. ఆ లెక్కన కొత్తగా ఇప్పటికిప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం నిర్మాలాసీతారామన్ - వెంకయ్యనాయుడులను రాజ్యసభకు పంపించడానికి మాత్రమే. కానీ... ఈ రాజకీయ మెలికను విస్మరిస్తూ బీజేపీ నేతలు చంద్రబాబును ఫిరాయింపుల విషయంలో ఇరుకునపెడుతున్నారు.

రాజ్యసభలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర సహాయ మంత్రులు సుజనా చౌదరి (తెలుగు దేశం) - శ్రీమతి నిర్మలా సీతారామన్‌ (బిజెపి)లతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్‌ - జె.డి.శీలంల సభ్యత్వం జూన్‌ 21తో ముగియనుంది. అలాగే, తెలంగాణకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వి.హనుమంతరావు - టిడిపి తరపున ఎన్నికైనా ఇటీవలనే టిఆర్‌ ఎస్‌ లో చేరిన శ్రీమతి గుండు సుధారాణి సభ్యత్వం కూడా అదేరోజున ముగియనుంది. జూన్‌ - జులై - ఆగస్టు మాసాలలో రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగుస్తున్న ఇతర ప్రముఖులలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు (కర్ణాటక) - సురేష్‌ ప్రభు - చౌధరి బీరేంద్రసింగ్‌ (హర్యానా) - పియుష్‌ గోయల్‌ (మహారాష్ట్ర) - ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి (యుపి) - కాంగ్రెస్‌ నాయకులు శ్రీమతి అంబికా సోని (పంజాబ్‌) - ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ (కర్నాటక) - శ్రీమతి మొహిసినా కిద్వాయ్‌ (చత్తీస్‌ ఘడ్‌) - జనతాదళ్‌ (యు) నాయకులు శరద్‌ యాదవ్‌ - కె.సి.త్యాగి (బీహార్‌) - ఎన్‌ సిపి నాయకుడు ప్రఫుల్‌ పటేల్‌ (మహారాష్ట్ర) - బిఎస్‌ పి నాయకుడు సతీశ్‌చంద్ర మిశ్రా (యుపి) - ప్రముఖ న్యాయవాది రామ్‌ జెత్మలానీ (రాజస్థాన్‌) తదితరులున్నారు.

కర్ణాటక నుండి జూన్‌ 29న రిటైర్‌ కావాల్సి ఉన్న ఇండిపెండెంట్‌ సభ్యుడు విజయ్‌ మాల్యా ఈనెల 4వ తేదీన తన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జులై 4వ తేదీతో పదవీకాలం ముగియనుండడంతో ఇప్పటివరకూ రాజస్థాన్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆనంద్‌ శర్మ కూడా గత మార్చి 3వ తేదీన రాజీనామా చేసి ఏప్రిల్‌లో తన స్వంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నుండి తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే రెండు మాసాల వ్యవధిలో రిటైరవుతున్న మొత్తం 57 మంది రాజ్యసభ సభ్యులలో కాంగ్రెస్‌ - బిజెపిలకు చెందిన చెరి పధ్నాలుగుమంది ఉండగా, బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన ఆరుగురు - జనతాదళ్‌ (యు)కు చెందిన అయిదుగురు - సమాజ్‌వాదీ పార్టీ, బిజూ జనతాదళ్‌ - అన్నా డిఎంకెలకు చెందిన ముగ్గురేసి - డిఎంకె - ఎన్‌ సిపి సభ్యులు ఇద్దరేసి - శివసేన - తెలుగుదేశం - టిఆర్‌ ఎస్‌ లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

ఇవన్నీ ఎలా ఉన్నా ఇప్పటికే ఏపీ కోటాలో రాజ్యసభలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్... కర్ణాటక నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తూ ఈసారి ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలనుకుంటున్న బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కోసం చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నది సుస్పష్టం. వీరిని రాజ్యసభకు పంపించే బాధ్యత చంద్రబాబు భుజాలపై లేకుండా మరో ఏడాదిన్నర, రెండేళ్ల వరకు వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే అవసరమే చంద్రబాబుకు లేదు.

ఈ రాజకీయ సమీకరణాలన్నీ తెలిసి కూడా ఏపీ బీజేపీ నేతలు ఫిరాయింపుల వ్యవహారంలో చంద్రబాబును డైరెక్టుగా విమర్శిస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం కూడా చంద్రబాబును ఈ రకంగా వాడుకుంటూ కూడా తమ ఏపీ నేతల నోటికి అడ్డుకట్ట వేయకపోవడం ఆశ్చర్యకరమే. అయితే... ఫిరాయింపుల వ్యవహారంలో నిందలు మోస్తున్న చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ తమను విమర్శిస్తున్న బీజేపీ నేతల వద్ద ఈ పాయింటు లేవనెత్తి వారి నోళ్లు మూయించే ప్రయత్నం చేయడంలేదు. కేవలం ప్రత్యేక హోదా, కేంద్ర సాయంలపైనే మాట్లాడుతున్నారు. ఇకనైనా ఈ ఫిరాయింపులన్నీ మీ కోసమేనయ్యా అని చెప్పగలిగితే.. ఫిరాయింపుల పాపం మీదేనని వివరించగలిగే చంద్రబాబుపై నిందారోపణలు తగ్గుతాయి. లేదంటే నవ్యాంధ్ర రాజకీయ చరిత్రలో చంద్రబాబుపై చెరగని మచ్చపడడం ఖాయం.

-- గరుడ