Begin typing your search above and press return to search.

కేటీఆర్ ట్రాప్ లో బీజేపీనేతలు అడ్డంగా బుక్

By:  Tupaki Desk   |   18 April 2021 3:30 PM GMT
కేటీఆర్ ట్రాప్ లో బీజేపీనేతలు అడ్డంగా బుక్
X
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అసలుసిసలు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న కమలనాథులకు.. గులాబీ చిన్న బాస్ దిమ్మ తిరిగే షాకిచ్చారు. స్నేహంగా ఉన్నట్లు ఉండి.. వల విసిరిన కేటీఆర్ ప్లానింగ్ ను అర్థం చేసుకోలేని బీజేపీ నేతలు చిక్కిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కమలం పార్టీలో కొత్త కలకలాన్ని రేపింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి కీలకమైన పోలింగ్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు.. కేటీఆర్ ను హైదరాబాద్ కు చెందిన కొందరు నేతలు కలిశారు. తమపై నిత్యం నోరు పారేసుకునే బీజేపీ నేతల భుజాలపై చేతులేసి.. వారికి ధైర్యం చెబుతున్నట్లుగా మంత్రి కేటీఆర్ ఫోటో తెలంగాణ బీజేపీ నేతలకు దిమ్మ తిరిగే షాకిచ్చేలా చేసింది.

ఇంతకీ ఏం జరిగింది? కరుడుగట్టినట్లుగా ఉండే కమలనాథులు.. అంత సింఫుల్ గా కేటీఆర్ ట్రాప్ లో ఎలా పడిపోయారు? అన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే.. గ్రేటర్ ఎన్నికల వద్దకు వెళ్లాలి. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎల్ బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లింగోజీగూడ అనే డివిజన్ ఉంది. అక్కడి బీజేపీ అభ్యర్థిగా రమేశ్ గౌడ్ నిలిచారు. ఓట్లు లెక్కింపు జరిగి.. విజయం సాధించిన ఆయన.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసే లోపే.. ఆయన మరణించారు. దీంతో.. ఆ సీటుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.

అయితే.. అనూహ్య మరణం చోటు చేసుకున్న నేపథ్యంలో.. ఎలాంటి పోటీ లేకుండా రమేశ్ గౌడ్ ఇంట్లోని వారికి ఉప ఎన్నికల బరిలో నిలిచి.. ఏకగ్రీవం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. మరోసారి పోటీ అన్న మాట అటు బీజేపీ కే కాదు. .టీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదు. దీనికి సంబంధించి తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. అయితే.. సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో.. లింగోజీ గూడ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేందుకు తాము సహకరిస్తామన్న సంకేతాన్ని మంత్రి కేటీఆర్ ఇవ్వటమే కాదు.. ప్రగతిభవన్ కు రావాలన్న బిస్కెట్ వేశారు.

ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ముందు వెనుకా ఆలోచించుకోవటం చేస్తారు. అందుకు భిన్నంగా నగర బీజేపీ నేతలు.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని సంప్రదించకుండానే మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు ప్రగతిభవన్ కు వెళ్లిపోయారు. కీలకమైన సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ కు ఒక్కరోజు ముందు.. బీజేపీ నేతలు ప్రగతిభవన్ లో కేటీఆర్ తో భేటీ కావటం అంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇదేమీ ఆలోచించని బీజేపీ నేతలు.. బండి సంజయ్ తో తమకున్న విభేదాల్ని మనసులో పెట్టుకొని.. పార్టీ అధ్యక్షుల వారికి చెప్పకుండా సొంతనిర్ణయంతో వెళ్లటం.. వారు కోరుకున్నట్లే.. ఉప ఎన్నికల బరిలో నిలుచోమన్న మాట ఇవ్వటం జరిగిపోయాయి.

అయితే.. ఇదంతా సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముందు రోజుచోటు చేసుకోవటం చూస్తే.. మంత్రి కేటీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి.. బీజేపీ నేతలకు షాకిచ్చారనన విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడీ ఉదంతం బీజేపీ అంతర్గత విబేధాల్ని మరింత పెంచటమే కాదు.. పార్టీకి జరిగిన డ్యామేజ్ మీదా కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.