Begin typing your search above and press return to search.

గణాంకాల్ని చూపించి గొల్లుమంటున్న కమలనాథులు

By:  Tupaki Desk   |   25 Dec 2019 5:36 AM GMT
గణాంకాల్ని చూపించి గొల్లుమంటున్న కమలనాథులు
X
అంకెలు చాలా సిత్రంగా ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్లు అంకెల విలువలు మారిపోతుంటాయి. జార్ఖండ్ లో ఓటమిపాలైన బీజేపీ అధికారాన్ని కోల్పోవటం తెలిసిందే. తమ ఓటమికి కారణం ఏమిటన్న విషయం మీద లోతుగా విశ్లేషణలు చేస్తున్న కమలనాథులు.. తమ కంటి ముందుకొచ్చిన గణాంకాల్ని చూసి బావురమంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం అధికంగా ఉండటమే కాదు.. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పార్టీల కంటే ఎక్కువ ఓట్ల శాతం వచ్చినా పవర్ చేజారిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాల సాయంతో విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు సీట్లు పెరిగినప్పటికీ ఓట్లలో మాత్రం కోత పడింది. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా గెలుచుకున్న జేఎంఎం ఓట్లను రాబట్టుకోవటంలో మాత్రం రెండు శాతం వెనుకపడటం గమనార్హం.

2014 ఎన్నికల్లో 20 శాతం ఓట్లతో 19 స్థానాలు నెగ్గగా.. తాజా ఎన్నికల్లో 18 శాతం ఓట్లతో 30 స్థానాల్ని సొంతం చేసుకుంది. మరోవైపు బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నం. ఆ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే 2 శాతం ఓట్లను అధికంగా వచ్చినప్పటికీ తక్కువ సీట్లు రావటంతో అధికారాన్ని చేజార్చుకుంది. 2014లో బీజేపీకి 31 శాతం ఓట్లతో 37 సీట్లు రాగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 33 శాతం ఓట్లు లభించినా అధికారం సొంతం కాలేదు. కేవలం పాతిక సీట్లకే పరిమితమైంది. దీనికి కారణం మిత్రుల అండ లేకపోవటమే. కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్.. జేఎంఎంలు 47 స్థానాలు సొంతం చేసుకుంటే ఒంటికాయ సొంటికొమ్ము మాదిరి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. భారీ మూల్యాన్ని చెల్లించింది.