Begin typing your search above and press return to search.

'కమలాలూ... కవచాలు ధరించాలి తమరు!'

By:  Tupaki Desk   |   19 Feb 2018 11:30 PM GMT
కమలాలూ... కవచాలు ధరించాలి తమరు!
X
ఎంత చెడ్డా.. భాజపా నాయకుల్ని చాలా విషయాల్లో గొప్ప వారని మెచ్చుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తమను ఛీ కొడతారని తెలుసు. తాము చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజలు మొత్తం గుర్తిస్తున్నారని తెలుసు. ఏదో నక్షత్రాల హోటళ్లలో ఏసీ గదుల్లో సమావేశాలు పెట్టుకోవడమూ.. సరిగ్గా ప్రెస్ వాళ్లకు చాలినన్ని కుర్చీలు కూడా ఏర్పాటు చేయకుండా.. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ లు పెట్టడం మాత్రమే ఇప్పటిదాకా వారికి చేతనైన పని. మహా అయితే పేజీలకొద్దీ వంటకాల్ని ప్రింట్లు తీసి, నివేదిక పేరుతో పంచిపెట్టడం కూడా వారికి వచ్చు. మొన్నటికి మొన్న నిజాల పేరుతో భాజపా పదాధికారుల సమావేశంలో ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. అయితే పుస్తకాలు విడుదల అంటే తమను ప్రజలు తమని మరీ ముసలి ముతక ఆలోచనల కింద జమకట్టేస్తారేమో అని భయపడి తాజాగా సీడీలు తయారుచేస్తాం అంటున్నారు. తమాషా ఏంటంటే.. సీడీలు కూడా ముసలివేఅని.. ఆధునిక ప్రపంచంలో సీడీ ప్లేయర్ లకు కూడా దిక్కుమొక్కు లేదని.. వారికి అన్నీ ఇలాంటి దిక్కూమొక్కూ లేని ఆలోచనలే వస్తున్నాయని వారు గ్రహించడం లేదు.

కాకపోతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించేయడానికి తాము ఎంత గొప్పగా కష్టపడుతున్నామో.. కేంద్రంనుంచి ఎంత అద్భుతంగా నిధులు విడుదల చేయిస్తున్నామో డప్పు కొట్టుకోవడానికి రాష్ట్రవ్యాప్త యాత్రకు వెళ్లాలని ముచ్చట పడుతున్న కమల దళాలు.. వెళ్లేప్పుడు ఒళ్తా కవచాలు - శిరస్త్రాణాలు కూడా ధరించి వెళ్లాలని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

ఎందుకంటే.. భాజపా నాయకులు కనిపిస్తే చాలు... టమోటాలు - కోడిగుడ్లు కాదు కదా.. దేనితో కొడితే వారికి బుద్ధి వస్తుందా.. తాము చేసిన ద్రోహం, చేస్తున్న నయవంచన గురించి వారికి ఆలోచన కలుగుతుందా? అని ప్రజలు ఆవేశపడుతున్నారు. ఇప్పటిదాకా పార్లమెంటు తొలివిడత బడ్జెట్ సమావేశాలు పూర్తయి కూడా వారం పైగానే గడుస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో ఏపీ ఎంపీల నిరసనల పర్వంతరువాత, సభ ముగియగానే.. రెండు మూడు రోజుల్లో లెక్కలు తేల్చి చెబుతాం అని కేంద్రం పేర్కొంది. ఇప్పటిదాకా తేల్చిందేమిటో ఎవ్వరూ ప్రకటించలేదు. రాష్ట్ర భాజపా మాత్రమే కొన్ని ప్రింటవుట్లు చేతిలో పెట్టుకుని.. అవాకులు చవాకులు పేలుతోంది.

వీళ్లు ‘‘ఇన్‌ డోర్’’ ప్రచారానికి పరిమితం అయినంత వరకు సేఫ్ గా ఉన్నట్లే లెక్క.. ‘‘అవుట్ డోర్’’ ప్రచారానికి తెగించి, యాత్రలు చేస్తాం అని అత్యుత్సాహం ప్రదర్శించారంటే మాత్రం.. కమలనాధులకు కవచాలు పగిలేలా ప్రజలు బుద్ధి చెబుతారని అంతా అనుకుంటున్నారు.