Begin typing your search above and press return to search.

అమిత్‌ షా ప్ర‌క‌ట‌న‌తో..హైద‌రాబాద్‌ లో క‌ల్లోల‌మేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2019 4:26 AM GMT
అమిత్‌ షా ప్ర‌క‌ట‌న‌తో..హైద‌రాబాద్‌ లో క‌ల్లోల‌మేనా?
X
జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) గురిచి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పొరుగు దేశాలకు వెళ్లి అక్కడ శాశ్వతంగా ఎవరూ నివసించరని.. అటువంటిది మనదేశంలోనే ఎందుకు జరుగుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాలనుంచి భారత్‌ కు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న లక్షలాది మందిని గుర్తించి వారిని వెనక్కి పంపే ఆలోచనలో భాగంగా ఎన్‌ ఆర్‌ సీని అమలు చేస్తోంది మోదీ సర్కార్. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను ఏరివేసేందుకు కేంద్రం జాతీయ పౌర జాబితాను అమలు చేస్తోంది. ఇప్పటికే అసోంలో దీన్ని చేపట్టి లక్షలాది మంది వలసదారుల్ని గుర్తించింది ప్రభుత్వం. దీంతో ఎన్ ఆర్‌ సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది.

తాజాగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ మీడియా గ్రూప్‌ కు చెందిన హిందీ పత్రిక హిందుస్థాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పూర్వోదయ్‌ హిందుస్థాన్‌' కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి - బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తుందన్నారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించడానికి దేశమంతటా ఎన్నార్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘అమెరికా - బ్రిటన్‌ - రష్యాల్లో ఒక్క భారతీయుడైనా చట్ట విరుద్ధంగా నివసించగలడా? లేదు. ఎటువంటి చట్టపరమైన పత్రాలు లేకుండా భారత్‌ లో ఇతర దేశీయులు ఎలా జీవిస్తారు? అందుకే దేశమంతటా ఎన్నార్సీని అమలు చేయాలి’ అని చెప్పారు. గత నెలాఖరుతో అసోంలో ఎన్నార్సీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉండ‌గా - ఇప్పటికే హైదరాబాద్‌ లో కూడా ఎన్‌ ఆర్‌ సీ అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఎంతోమంది అక్రమంగా నివసిస్తున్నారని - వీసా గడువు ముగిసినా ఇంకా ఇక్కడే ఉంటున్నారని రాజాసింగ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కొన్నేళ్లుగా హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. విదేశాలకు చెందినవారు వేల మంది హైదరాబాద్‌ లో ఉంటున్నారని - మతోన్మాద మజ్లీస్ పార్టీ ఉగ్రవాదులకు అండగా ఉంటోందని ఆయన విమర్శించారు. అక్రమ చొరబాటుదారులకు మజ్లిస్‌ మద్దతు ఇస్తోందని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఎన్ ఆర్‌ సీ ఇక్క‌డ కూడా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. మొత్తంగా....కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఎన్‌ ఆర్‌ సీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తే హైదరాబాద్‌ లో కూడా త్వరలోనే దీన్ని అమలు చేసే అవకాశాలున్నాయి.