Begin typing your search above and press return to search.

3 రాజధానులు.. చీలిపోయిన బీజేపీ

By:  Tupaki Desk   |   29 Dec 2019 11:08 AM GMT
3 రాజధానులు.. చీలిపోయిన బీజేపీ
X
ఏపీకి 3 రాజధానులు అవసరం అని ప్రకటించిన సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే దీన్ని వ్యతిరేకిస్తూ మౌనదీక్ష చేపట్టారు. బీజేపీ వ్యతిరేకిస్తుందని అంతా అనుకుంటున్న వేళ ట్విస్ట్ నెలకొంది..

తాజాగా విశాఖ పట్నం పరిపాలన రాజధానిని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేకించగా.. ఆయన పార్టీకే చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన విష్ణు కుమార్ రాజు సమర్థించడం హాట్ టాపిక్ గా మారింది.

విశాఖలో విలేకరులతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన ప్రకటన చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని.. విశాఖపట్నంను రాజధాని చేసే జగన్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని తేల్చిచెప్పారు. ఏపీలో విశాఖకు తప్ప మరే నగరానికి రాజధాని అయ్యే అర్హత లేదన్నారు. విశాఖ పెద్ద సిటీ కావడంతో నిర్మాణ వ్యయాన్ని సైతం నియంత్రించవచ్చని తెలిపారు. భవనాలు - భూములు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా కొత్త వాటిని నిర్మించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 3 రాజధానులపై మౌనదీక్ష చేస్తే కూడా విష్ణుకుమార్ రాజు ఆ నిరసనకు హాజరు కాలేదు. మద్దతు తెలుపలేదు. ఉత్తరాంధ్రవాసి అయిన విష్ణుకుమార్ తాజాగా బీజేపీ స్టాండ్ కు భిన్నంగా విశాఖ రాజధానికి మద్దతు తెలుపడం ఆ పార్టీని నిలువునా చీల్చినట్టైంది.