Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ నేతలదీ పక్షపాతమా.? ‘పచ్చ’ పాతమా?

By:  Tupaki Desk   |   5 Jan 2020 2:30 PM GMT
ఏపీ బీజేపీ నేతలదీ పక్షపాతమా.? ‘పచ్చ’ పాతమా?
X
ఏపీ బీజేపీ నేతలదీ పక్షపాతమో.. లేక ‘పచ్చ’పాతమో తెలియడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాజధాని మార్పు విషయంలో ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అయితే ఫక్తు చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తూ అమరావతిని మారిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని సీఎం జగన్ ను హెచ్చరిస్తున్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయితే మౌన దీక్షలతో ముడిపెట్టి రోజుకో మంటపుట్టించే ప్రకటన చేస్తూ టీడీపీకి ఫేవర్ గా రాజకీయం చేస్తున్నారు.

ఏపీ బీజేపీ నేతల రొద ఇలా ఉంటే అసలు కేంద్రం ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ విషయంలో ఇప్పటివరకూ వ్యతిరేకంగా స్పందించి లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. స్వయంగా ఇటీవల ‘రాజధానుల మార్పు అనేది రాష్ట్రాల అంతర్గతం వ్యవహారమని.. కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.

అమరావతి రాజధాని మార్పుపై ఇంత స్పష్టంగా కేంద్రం తరుఫున కిషన్ రెడ్డి ప్రకటన చేసినా ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఎగిరెగిరి పడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి ఇతర బీజేపీ రాష్ట్ర నేతలు జగన్ సర్కారు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీకి సపోర్టుగా రాజకీయాలు మొదలుపెట్టారు.

కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చెప్పినా.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు మౌనంగా ఉన్న ఏపీ బీజేపీ నేతలు మాత్రం రాజధానిపై రచ్చ చేస్తూ వారి నిర్ణయానికే ఎదురెళ్లుతున్నారు. మరి వీరి దూకుడుకు కేంద్రం కళ్లెం వేస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.