Begin typing your search above and press return to search.

ప్రకాశ్ రాజ్‌ ను తిడితే డ్యామేజ్ బీజేపీకేనా?

By:  Tupaki Desk   |   4 Oct 2017 5:01 AM GMT
ప్రకాశ్ రాజ్‌ ను తిడితే డ్యామేజ్ బీజేపీకేనా?
X
రాజ‌కీయాల‌కు ఏ మాత్రం సంబంధం లేని ప్ర‌ముఖులు.. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారిపై విమ‌ర్శ‌లు చేయ‌టం చాలా అరుదు. త‌మ‌కు న‌చ్చినా.. న‌చ్చ‌కున్నా ప్ర‌భుత్వ విధానాల్ని విమ‌ర్శించ‌టానికి పెద్ద ఆస‌క్తి చూప‌రు. ప్ర‌ముఖుల విమ‌ర్శ‌లు నోటి మాట‌తో పోయేవి కావు. అందుకు త‌గిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న విష‌యం ప్ర‌ముఖుల‌కు తెలియంది కాదు. అందుకే.. ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అధికార‌ప‌క్షం మాట వ‌ర‌స‌కు విమ‌ర్శించ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. మ‌రి.. అలాంటి తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఉదంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. విల‌క్ష‌ణ న‌టుడిగా జాతీయ స్థాయిలో సుప‌రిచితుడైన ప్ర‌కాశ్ రాజ్ తాజాగా ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

ఇటీవ‌ల కాలంలో జాతీయ‌స్థాయిలో సుప‌రిచితుడైన సినీ ప్ర‌ముఖుడు ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి ఇంత ఘాటుగా విమ‌ర్శించింది లేద‌ని చెప్పాలి. న‌ట‌న‌లో త‌న‌ను మించి పోయార‌ని.. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్ దారుణ హ‌త్య‌పై ప్ర‌ధాని మౌనంగా ఉండ‌టాన్ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. ఆయ‌న త‌న‌కు మించిన న‌టుడని మండిప‌డ్డారు. గౌరీ లంకేశ్ హ‌త్య‌పై మోడీ ఎందుకు పెద‌వి విప్ప‌రంటూ మండిప‌డ్డారు.

ఒక ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు పాశ‌వికంగా హ‌త్య‌కు గురైన‌ప్పుడు ప్ర‌ముఖులు స్పందించ‌టం రివాజే. ఆ కోణంలో చూసిన‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర తీసిన గౌరీ లంకేశ్ హ‌త్య‌పై మోడీ ఎందుకు రియాక్ట్ కాలేద‌న్న ప్ర‌శ్న చాలామందిలో ఉంది. చ‌నిపోయిన గౌరీ లంకేశ్ త‌న‌కు బాగా తెలిసి ఉండ‌టం.. దారుణంగా హ‌త‌మార్చిన అంశాన్ని మోడీ లాంటి ప్ర‌ధాని రియాక్ట్ కాక‌పోవ‌టాన్ని ప్ర‌కాశ్ రాజ్ జీర్ణించుకొని లేక‌పోవ‌చ్చు. అందుకే ఆయ‌న మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లే చేశార‌ని చెప్పాలి.

ఊహించ‌నిరీతిలో ప్ర‌కాశ్ రాజ్ లాంటి ప్ర‌ముఖుడి నోటి నుంచి మోడీని విమ‌ర్శించేలా మాట‌లు రావ‌టాన్ని బీజేపీ నేత‌లు అస్స‌లు స‌హించ‌లేక‌పోతున్నారు. త‌మ అధినేత‌పై విమ‌ర్శ‌లు చేస్తారా? అంటూ మాట‌ల దాడికి దిగారు. ప్ర‌ధానిని విమ‌ర్శిస్తే రాత్రికి రాత్రి జాతీయ‌స్థాయిలో పేరు వ‌స్తుంద‌న్న భ్ర‌మ‌లో నోరు జారొద్దంటూ హెచ్చ‌రించ‌టం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క ఎంపీ శోభా కరంద్లాజే.. ఎమ్మెల్యే సురేశ్ కుమార్ లు తాజాగా విరుచుకుప‌డ్డారు.

ఉన్న మాట అంటే ఉలుకెక్కువ‌ని ఊరికే అన‌రు. తాజాగా క‌మ‌ల‌నాథుల మాట‌ల్ని వింటే ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. ప్ర‌కాశ్ రాజ్ లాంటి న‌టుడికి ఇప్పుడు ఉన్న గుర్తింపు స‌రిపోదా? మోడీని విమ‌ర్శించి మ‌రీ గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఉందా?

నిజాయితీగా ఒక అంశం మీద మాట్లాడిన‌ప్పుడు అందులోని ఆవేద‌న‌ను అర్థం చేసుకోవాలే కానీ.. నోరు ఉంది క‌దా అని విరుచుకుప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అధికారం త‌లకెక్కిన వైనం ప‌లు సంద‌ర్భాల్లో బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఇదే రీతిని కొన‌సాగిస్తే.. అధికారాన్ని అప్ప‌గించిన ప్ర‌జ‌లు ఛీ కొట్టే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌న్న వాస్త‌వాన్ని క‌మ‌ల‌నాథులు గుర్తిస్తే మంచిది.