Begin typing your search above and press return to search.

బీజేపీ ఫీలవుతోందట బాబు!

By:  Tupaki Desk   |   2 Aug 2016 10:30 PM GMT
బీజేపీ ఫీలవుతోందట బాబు!
X
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ-టీడీపీల మ‌ధ్య గ్యాప్‌ ను బాగానే పెంచుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.మిత్ర‌ప‌క్ష పార్టీకి చెందిన నాయ‌కుడిగా బాబు స్పెష‌ల్ స్టేట‌స్ డిమాండ్‌ ను కేంద్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం, అదే స‌మ‌యంలో బీజేపీ ఏపీకి అన్యాయం చేసింద‌ని బాబు ఫైర‌యిన నేప‌థ్యంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త చ‌ర్చ సాగుతోంది. ర‌క్తం మ‌రుగుతోంది, బీజేపీతో తెగ‌దెంపులే వంటి చంద్ర‌బాబు కామెంట్ల‌ను బీజేపీ ప్ర‌త్యేకంగా అధ్య‌యనం చేస్తోంద‌ని స‌మాచారం.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ఇచ్చిన సమాధానంపట్ల సీఎం చంద్రబాబు మీడియా వద్ద వ్యక్తం చేసిన ప్రతికూల అభిప్రాయాలు బీజేపీ అధినాయకత్వానికి ఎంతమాత్రం నచ్చలేదని విశ్వసనీయ వ‌ర్గాల స‌మాచారం. బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత విలేకరుల సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్థిక మంత్రిపై తేలికైన కామెంట్లు చేయటం ఏమిట‌ని క‌మ‌ళ‌నాథుల్లో అసంతృప్తి ర‌గులుతోంద‌ట‌. అంతేకాకుండా ప‌లువురు టీడీపీ నేత‌లు సైతం మోడీని, బీజేపీని త‌ప్పుప‌ట్ట‌డం ప‌ట్ల ఢిల్లీ క‌మ‌ళ‌నాథులు నొచ్చుకున్నార‌ని అంటున్నారు. చంద్ర‌బాబు స‌హా తెదేపా నేతలు బాహాటంగా విమర్శలు గుప్పించకుండా బీజేపీ అధినాయకులతో అంతర్గత చర్చలు జరిపితే బాగుండేదనేది బీజేపీ పెద్ద‌ల భావ‌న. ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదనేది గత ఏడాదే చంద్రబాబుకు స్పష్టం చేశాం. హోదాకు బదులు అత్యధిక ఆర్థిక సాయం అందించేందుకు ప్రయత్నిస్తోన్న సమయంలో, చంద్రబాబు విమర్శలు గుప్పించటమేంటి' అని పార్టీ నేత‌ల‌తో వారు చ‌ర్చ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ''ప్రత్యేక హోదా ఇవ్వటం వలన ఏపీకి వివిధ పథకాల అమలులో 90 శాతం గ్రాంటు, పది శాతం రుణం లభిస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఏపీకి ఇంతకంటే ఎక్కువే ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఏపీకి హోదా కావాలా? లేక అంతకంటే ఎక్కువ అర్థిక ప్యాకేజీ కావాలా?'' అని కేంద్ర సీనియర్ మంత్రి ఒకరు ఢిల్లీ పాత్రికేయుల‌తో అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ఏపీకి వీలైనంత వరకు ఎక్కువ ఆర్థిక సాయం, ఎక్కువ కాలం సాయం చేయటం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమనే దిశ‌గా వారి అభిప్రాయాలు ఉన్న‌ట్లు స‌మాచారం.