Begin typing your search above and press return to search.

మోడీ..చేస్త‌వా..చ‌స్త‌వా? అని అడిగేశాన‌న్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   3 Sep 2018 5:30 AM GMT
మోడీ..చేస్త‌వా..చ‌స్త‌వా? అని అడిగేశాన‌న్న కేసీఆర్‌
X
త‌న‌ను ఉద్దేశించి ఎవ‌రైనా విమ‌ర్శిస్తూ మాట్లాడితే మండిప‌డ‌తారు కేసీఆర్‌. మాట‌లు మాట్లాడేట‌ప్పుడు కాస్తంత జాగ్ర‌త్త‌గా మాట్లాడాలంటారు. అరే.. ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి మీద అలా మాట్లాడ‌తారా? అంటూ గ‌ర‌మైపోతారు. త‌న‌ను త‌ప్పు ప‌ట్టే వారి మీద విరుచుకుప‌డే కేసీఆర్‌.. తాను మాత్రం త‌న‌కు న‌చ్చినోళ్ల‌ను.. న‌చ్చ‌నోళ్ల‌ను ఉద్దేశించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్యానించటం కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తూ ఉంటుంది. తాజాగా కొంగ‌ర క‌లాన్ లో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ నోటి వెంట వ‌చ్చిన ఒక మాట ఇప్పుడు పెను వివాదంగా మారింది.

ఆఘ‌మేఘాల మీద జోన‌ల్ ఫైలును క‌దిలించి.. మోడీ స‌ర్కారు చేత సంత‌కం చేయించిన కేసీఆర్.. ఆ విష‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పిన తీరు ఇప్పుడు వివాదంగా మారింది.

జోన‌ల్ వ్య‌వ‌స్థ‌ను మారుస్తూ కేసీఆర్ స‌ర్కారు చేప‌ట్టిన ఫైల్ ను.. అంత త్వ‌ర‌గా క్లియ‌ర్ చేయ‌టాన్ని తెలంగాణ బీజేపీ నేత‌లు సైతం త‌ప్పు ప‌ట్టారు. అంత వేగంగా ఫైల్ ను క్లియ‌ర్ చేయాల్సిన అవ‌స‌రం ఏముందంటూ.. తాజాగా శంషాబాద్ విమానాశ్ర‌యంలో అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేత‌లు ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల్ని అనున‌యిస్తూ అమిత్ షా ఆచితూచి అన్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

కేంద్ర‌.. రాష్ట్రాల మ‌ధ్య సానుకూల వాతావ‌ర‌ణం ఉండ‌టం.. ఇచ్చి పుచ్చుకునే తీరు త‌ప్పు కాద‌న్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఇదిలా ఉంటే.. కొంగ‌ర కలాన్ స‌భ‌లో మాత్రం జోన‌ల్ ఫైల్ ను ఢిల్లీలో క‌దిలించి తీరుపై మాట్లాడిన సీఎం కేసీఆర్ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మాట్లాడి షాకిచ్చారు. తెలంగాణ తెచ్చిన‌ప్పుడు త‌న‌కెంత సంతోషం క‌లిగిందో.. తెలంగాణ స్థానికుల‌కు 95 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే కొత్త జోన‌ల్ విధానానికి ఆమోదం పొందిన‌ప్పుడు త‌న‌కు చాలా ఆనందం క‌లిగింద‌న్నారు.

ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డ‌ల‌కే 95 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌ధాన‌మంత్రి మోడీ కాస్తంత ఊగిస‌లాడుతుంటే.. తానే స్వ‌యంగా ఢిల్లీకి వెళ్లి.. చేస్త‌వా.. చ‌స్త‌వా .. మోడీ చెప్పు.. మా పంచాయితీ దీని మీద ఉన్న‌ద‌ని తాను నిల‌దీసి మ‌రీ జోన‌ల్ ఫైలు మీద ప్ర‌ధాని చేత సంత‌కం తీసుకున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా జోన‌ల్ వ్య‌వ‌స్థ ఫైల్ ను క్లియ‌ర్ చేసి ఇచ్చిన మోడీకి క్రెడిట్ ఇవ్వ‌క‌పోతే ఇవ్వ‌క‌పోయారు.. మ‌రీ దారుణంగా ఇలా ఎలా వ్యాఖ్య‌లు చేస్తారంటూ బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు

దేశానికి అత్యుత్త‌మ స్థానంలో ఉన్న వ్య‌క్తిని ఉద్దేశించి అలాంటి ప‌ద ప్ర‌యోగం స‌రైన‌దేనా? అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఒక ఫైలును ఒత్తిడి తెచ్చి మ‌రీ సంత‌కం పెట్టించుకున్న‌త‌ర్వాత‌.. ఫైలు మీద సంత‌కం పెట్టిన వ్య‌క్తిని బ‌ద్నాం చేసేలా.. చిన్న‌బుచ్చేలా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగంలో మోడీ ప్ర‌స్తావ‌న సంద‌ర్భంగా ఉప‌యోగించిన ప‌దంపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి.. దీనిపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో?