Begin typing your search above and press return to search.

బెంగాల్ లో టీఎంసీలోకి బీజేపీ నేతల క్యూ

By:  Tupaki Desk   |   2 Jun 2021 7:30 AM GMT
బెంగాల్ లో టీఎంసీలోకి బీజేపీ నేతల క్యూ
X
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వరకు టీఎంసీ నేతలు వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. మమతకు షాకిస్తూ బీజేపీ కూడా రెచ్చిపోయింది. కానీ ప్రజాతీర్పుతో బెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. మమతా బెనర్జీ హవా కొనసాగుతోంది. సీన్ మొత్తం రివర్స్ అవుతోంది.

ఎన్నికలకు ముందు బీజేపీ ధాటికి టీఎంసీ పార్టీ కకావికలం అయ్యింది. మమత రైట్ హ్యాండ్ సువేందు బీజేపీలో చేరి షాకిచ్చాడు. మమత ఏకంగా అతడిపైనే పోటీకి దిగి ఓడిపోయింది. ఎన్నికలకు ముందు వరకు పార్టీ నేతలను కాపాడుకోవడమే మమతా బెనర్జీకి పెద్ద సవాల్ గా ఉండేది. కానీ ఇప్పుడు బెంగాల్ లో మమత గెలిచాక ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

బీజేపీలో చేరిన చాలా మంది టీఎంసీ నేతల్లో ఇప్పుడు తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బెంగాల్ లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించి దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ సత్తా చాటారు. బీజేపీకి అస్సలు ఆశలు లేకుండా చేశారు. మొత్తం 292 స్థానాల్లో 213 గెలిచి.. బీజేపీని కేవలం 77 సీట్లకే పరిమితం చేశారు.

బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి టీఎంసీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహా గత మార్చిలో బీజేపీలో చేరింది. ఇప్పుడు పార్టీలో చేరి తప్పు చేశానని.. తిరిగి టీఎంసీలోకి రావాలనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. మరో నేత దీపేందు బిస్వాస్ కూడా అదే మాట అన్నాడు. మమతా బెనర్జీకి వీరిద్దరూ లేఖలు రాశారు.

ఇక బీజేపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీ నుంచి టీఎంసీలో చేరడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన 4 బీజేపీ ఎంపీలు టీఎంసీలో చేరాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

అయితే మమతా బెనర్జీ మాత్రం హ్యాండ్ ఇచ్చి వెళ్లిన వారి విషయంలో ఏం చేయాలన్నది పార్టీ కార్యకర్తలు, నేతలు అభిప్రాయం తీసుకుంటున్నారట.. దీనిపై కసరత్తు చేశాకే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.