Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీలో మ‌ర్మ‌మేంటి?

By:  Tupaki Desk   |   28 Aug 2018 4:27 PM GMT
కేసీఆర్‌ తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీలో మ‌ర్మ‌మేంటి?
X
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశ‌వ్యాప్తంగా కూడా ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ హాట్ టాపిక్‌. ఎందుకంటే..ఢిల్లీ వేదిక‌గా ఆయ‌న రాజ‌కీయ అడుగుల‌న్నీ దేశ రాజ‌కీయ నేత‌ల చూపును త‌న‌వైపు తిప్పుకొంటున్నాయి. ఎందుకంటే...ఒక ముఖ్య‌మంత్రితో 45 నిమిషాల పాటు స‌మావేశం అవ‌డం...అందులోనూ ఆయ‌న మిత్ర‌ప‌క్షం కాదు. పోనీ పార్టీ పరంగా స‌ద‌రు నాయ‌కుడి ఏలుబ‌డిలో ఉన్న రాష్ట్రంలో ఆశ‌లు వ‌దిలేసుకున్నారా అంటే అదీ లేదు.. ఆ రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని..ఇంకా చెప్పాలంటే..భ‌విష్య‌త్తులో....వీలైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చేయాల‌నేది టార్గెట్‌. అయిన‌ప్ప‌టికీ...పార్టీకి ప్ర‌త్య‌ర్థి అయిన సీఎంతో ముప్పావు గంట స‌మావేశం అవ‌డం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీకే చెల్లింది. అలా ఆయ‌న‌తో సుదీర్ఘ స‌మావేశం అయింది, అది కూడా రోజుల 10 వ్య‌వ‌ధిలో తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు సార్లు స‌మావేశం అయ్యారు.

ఇలా స్వ‌ల్ప‌కాలంలోనే రెండు ద‌ఫాలుగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశం అవుతున్న తీరు చూస్తుంటే....ప్ర‌ధాని మోడీకి కేసీఆర్ ర‌హ‌స్య మిత్రుడ‌నే భావ‌న క‌లుగుతోంది. ఇటీవ‌లి కాలంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీతో భేటీల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌...తాజాగా రెండ్రోజుల కింద‌ట‌ ఢిల్లీలో మోడీజీతో స‌మావేశం అయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమై సుమారు ముప్పావు గంట చ‌ర్చించారు. అనంత‌రం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రిని బీజేపీ ఎమ్మెల్యేలు క‌లిశారు. అక‌స్మాత్తుగా ఈ భేటీ అవ‌డం వెనుక కార‌ణం ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ముంద‌స్తు నేప‌థ్యంలో, బీజేపీకి- టీఆర్ఎస్‌కు మ‌ధ్య స‌ఖ్య‌త కుదురుతోంద‌నే వాతావ‌ర‌ణంలో ఈ భేటీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అయితే, దీనిపై బీజేపీ వెంట‌నే అల‌ర్ట్ అయింది. హైదరాబాద్‌ లో వాజ్ పేయి విగ్రహం పెట్టడంపైనే చర్చ అని బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు. త‌మ స‌మావేశానికి రాజ‌కీయ రంగు పుల‌మ‌ద్ద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కోరారు. కాగా, సీఎం కార్యాల‌యం సైతం అన‌వ‌స‌ర ఊహాగాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌య‌త్నం చేసింది. ``హైదరాబాదులో వాజపేయి విగ్రహం నెలకొల్పాలని బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ ను కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ - శాసనసభ పక్ష నాయకుడు కిషన్ రెడ్డి - ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి - ప్రభాకర్ - ఎమ్మెల్సీ రామచంద్రరావు మంగళవారం ప్రగతిభవన్ లో సీఎంను కలిశారు . హైదరాబాదులో వాజ్ పేయ్ విగ్రహంతో పాటు స్మారక మందిరం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు`` అంటూ ముక్త‌స‌రిగా ముగించింది. అయితే, ఇందుకు సంబంధించిన ఫొటోలు ఏవీ విడుద‌ల చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.