ప్రాణమిత్రుడికి కేసీఆర్ ఏం చేస్తారు?
By: Tupaki Desk | 9 April 2015 12:30 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తను తలచుకుంటే ఏదైనా చేయగలరు. అవసరం అనుకుంటే ఎంతటి కార్యానికైనా సై అనగలరు. నిజమైన సహాయం అవసరం ఉన్నపుడు పార్టీలు, ప్రాంతాలు వంటివేవి చూడరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కాన్సర్ చికిత్సను అమెరికాలో పాతిక లక్షలతో చేపించడమే ఇందుకు నిదర్శనం. అలాంటి కేసీఆర్‌కు సంకటకరమైన పరిస్థితులను తెచ్చిపెట్టింది బీజేపీ పార్టీ.
ఆలె నరేంద్ర. ఈ పేరు కంటే టైగర్ నరేంద్ర అంటేనే సిటీలో ఎక్కువ మందికి తెలుస్తుంది. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఈ నేత అనతికాలంలోనే కేసీఆర్‌కు కుడి భుజంగా మారిపోయారు. ఎంతగా అంటే.. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరే. పార్టీ పొత్తులు..భవిష్యత్ ఎత్తులు వీరిద్దరే నిర్ణయం తీసుకునే వారు. చాలా సందర్భాల్లో కేసీఆర్ సైతం నరేంద్ర చెపితే ఒకమాట... కేసీఆర్ చెపితే మరోమాట ఉంటదా? అని ప్రకటించారు. టీఆర్ఎస్ తరఫున నరేంద్ర రెండు సార్లు ఎంపీగా కూడా గెలిచారు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల నరేంద్ర టీఆర్ఎస్‌ను వీడారు. టీఆర్ఎస్ (ఎన్)పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్నారు. అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత తిరిగి మాతృ పార్టీ అయిన బీజేపీలో చేరారు. అనారోగ్య కారణంతో గత ఏడాది మరణించారు.
నరేంద్ర విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని బీజేపీ నిర్ణయించింది. సీఎంను టెస్ట్ చేయాలనుకుందో ఏమో తెలియదు కానీ.....సిటీలో విగ్రహాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వాల్సి ఉంటే.. బీజేపీ నాయకులు మాత్రం నేరుగా ముఖ్యమంత్రికే వినతిపత్రం ఇచ్చారు. సిటీలోని బర్కత్‌పుర చౌరస్తా, కాచిగూడా చౌరస్తా లేదా మరో రెండు చోట్లలో ఎక్కడైనా నరేంద్ర విగ్రహాన్ని ఏర్పాటుచేయించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బుధవారం సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. అందులో స్థలం డిమాండ్ పెట్టడమే కాదు...ఏప్రిల్ తొమ్మిదికి నరేంద్ర చనిపోయి ఏడాది అవుతున్నదని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే సీఎంను కలిసిన రోజుకు...నరేంద్ర వర్దంతికి మధ్య ఉన్న గడువు కేవలం ఒక్కరోజే!! తద్వారా ముఖ్యమంత్రిపై మానసికంగా ఒత్తిడి తెచ్చినట్లయింది.