Begin typing your search above and press return to search.

బీజేపీ.. పోటీలో ఉన్నట్టా లేనట్టా?

By:  Tupaki Desk   |   16 Oct 2019 1:30 AM GMT
బీజేపీ.. పోటీలో ఉన్నట్టా లేనట్టా?
X
అదిగో కేసీఆర్ దిగిపోతే తమకే అధికారం అన్నారు. అమిత్ షా రంగంలోకి దిగబోతున్నారు..తెలంగాణలో పాగా వేయడమే తరువాయి అని అంటున్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా సాధించిన విజయాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగానే హడావుడి చేసింది. అయితే ఆ మాటలన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఇప్పుడు చేతల్లో చూపాల్సిన అవసరం ఏర్పడింది.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక బీజేపీకి కూడా పెద్ద పరీక్షే అవుతోంది. అక్కడ పార్టీని గెలిపించడానికి ముఖ్య నేతలంతా బరిలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలిచినా ఉపయోగం ఉండదని - కేవలం బీజేపీ గెలిస్తేనే ప్రయోజనం అని వారు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు.

అయితే ఇప్పటి వరకూ హుజూర్ నగర్లో బీజేపీ అభ్యర్థికి ఊపు అయితే కనిపిచడం లేదు. టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చేసుకునే ప్రకటనలకు ధీటుగా అక్కడ అభ్యర్థి ఊపు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ బీజేపీ ఎలాంటి ఫలితాన్ని పొందుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది.

ప్రధానంగా అందుతున్న సమాచారం మేరకు.. హుజూర్ నగర్ లో పోటీ రెండు పార్టీల మధ్యనే. టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ల మధ్యనే అక్కడ పోటీ నడుస్తూ ఉంది. ఎవరు గెలిచినా..ఆరేడు శాతం ఓట్ల తేడా తో బయటపడే
అవకాశం ఉంది. ఈ తేడా ఓట్లకు సమానంగా ఇతర పార్టీలన్నీ ఓట్లను సంపాదించుకోవడమే గగనం.. అనే ప్రచారమూ సాగుతూ ఉంది. ప్రచారం ఆఖరి వరకూ చేసినా.. చిన్నాచితక పార్టీలు ఆఖరి రోజు అంతర్గతంగా ఒప్పందానికి వచ్చి ఏదో ఒక పార్టీకి తమ అనుచరవర్గంతో పని చేయించినా పెద్దగా ఆశ్చర్యంలేదనే ప్రచారం సాగుతూ ఉంది.

బీజేపీ నేతలు మాత్రం గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. టీఆర్ ఎస్ - కాంగ్రెస్ లలో ఎవరిని గెలిపించినా ప్రయోజనం లేదని.. తమనే గెలిపించాలని వారు ప్రచారం సాగిస్తూ ఉన్నారు.