Begin typing your search above and press return to search.

యడ్డీ వారసుడి వేటలో కమలనాథులు

By:  Tupaki Desk   |   23 Aug 2020 11:30 AM GMT
యడ్డీ వారసుడి వేటలో కమలనాథులు
X
దేశం మొత్తం కాషాయ జెండా ఎగరాలన్న బీజేపీ లక్ష్యం ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటే.. దాన్ని సాధించే వరకు విడిచిపెట్టని మొండితనం మోడీషాల సొంతం. ఇది కూడా.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరటానికి కారణమైందని చెప్పాలి. ఎక్కడిదాకానో ఎందుకు.. కర్ణాటక.. మధ్యప్రదేశ్.. బిహార్ రాష్ట్రాలు ఇందుకు పెద్ద ఉదాహరణలుగా చెప్పక తప్పదు. ప్రజాదరణతో జెండా ఎగురవేయటం ఒక ఎత్తు.. అందుకు భిన్నంగా నోటి వరకు వచ్చి చేజారిన వాటిని ఎలా దక్కించుకోవాలో కర్ణాటక ఎపిసోడ్ లో చేసి చూపించిన కమలనాథులు.. తాము గురి పెడితే.. ఎవరైనా దారికి రావాల్సిందేనన్న విషయాన్ని బిహార్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చూపించారు.

ఇంత జరిగినా.. కమలనాథులకు కొరుకుడుపడని పెద్ద రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. దక్షిణాదిన కర్ణాటక తప్పించి మిగిలిన అన్నిచోట్ల కమలనాథులకు సరైన బలం లేని సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలోనూ ఎదురుదెబ్బలు తప్పట్లేదు. పెద్ద రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ తో పాటు.. ఒడిశా రాష్ట్రాలతో పాటు.. పలు రాష్ట్రాలు ఒక పట్టాన కొరుకుడుపడని తీరు తెలిసిందే.

ఇప్పటికే పట్టు సాధించిన రాష్ట్రాల్లో బలాన్ని మరింత పెంచుకోవటంతో పాటు.. చేతికి రాని రాష్ట్రాల్ని చేజిక్కించుకోవటానికి వీలుగా అదేపనిగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది బీజేపీ అధినాయకత్వం. కర్ణాటక విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడియూరప్పకు వారసుడ్ని వెతికే పనిని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ఆ సమయానికి పార్టీని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా పని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే యడ్డీ సూచనల్ని ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యులకు సంబంధించి యడ్డి పంపిన జాబితానుపక్కన పెట్టి.. పార్టీ జాతీయ సంఘటన కార్యదర్శి బీఎల్ సంతోశ్ పంపిన లిస్టులోని పేర్లను ఓకే చేయటం ద్వారా షాకిచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. ఆయన మీద వస్తున్న ఆరోపణలతో పాటు.. ఆయన వయసును పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన మరింత పెద్దవారు అవుతారు. అప్పటికి ఒక యువనాయకుడ్ని తెర మీదకు తీసుకురావాలన్న ఆలోచన బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు.. విపక్ష కాంగ్రెస్ విషయానికే వస్తే.. సిద్దరామయ్యతో పాటు.. డీకే శివకుమార్ లాంటి నేతల్ని ఢీ కొట్టటం అంతే తేలికైన విషయం కాదు కదా? అందుకే.. సమర్థుడ్ని ఎంపిక చేసి.. సిద్ధం చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతన్నారు. యడ్డీ వారసుడిగా ఎంపిక చేసే నేతకు ఏమేం ఉండాలన్న విషయం మీద చాలానే కసరత్తు చేసి.. ఒక జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.

లింగాయిత్ వర్గానికి చెందిన వ్యక్తి.. సంఘ్ పరివార్ బ్యాక్ గ్రౌండ్.. ప్రజల్లో పాపులార్టీతో పాటు.. ఎలాంటి రిమార్కు లేకుండా ఉండటంతో పాటు.. అందరిని కలుపుకుపోయే తత్త్వం ఉండాలని భావిస్తున్నారట. మరి.. ఇన్ని లక్షణాలు ఉన్న నేత ఎప్పటికి దొరుకుతారో.. ఏమిటో?