Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ క‌మ‌ల‌ను అస్స‌లు ఆప‌ట్లేదుగా?

By:  Tupaki Desk   |   31 Jan 2019 8:24 AM GMT
ఆప‌రేష‌న్ క‌మ‌ల‌ను అస్స‌లు ఆప‌ట్లేదుగా?
X
కొన్ని విష‌యాల్లో కొన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బ‌లు త‌గిలినా.. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లే ధోర‌ణి కనిపిస్తూ ఉంటుంది. తాజాగా మోడీ ప‌రివారం అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తోంది. సౌత్ లో తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చే ఏకైక అవ‌కాశం క‌ర్ణాట‌క రాష్ట్రంలోనే. ఆ స్టేట్‌ లో ఆ మ‌ధ్య‌న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ట్లుగా క‌ల‌లు క‌న్న క‌మ‌ల‌నాథులు చాలామందే ఉన్నారు.

మోడీషాలు కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన వేళ‌.. ఉద‌యం ప‌ది గంట‌ల‌కు వ‌చ్చిన ప్రాధ‌మిక ఫ‌లితాలు చూసి.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ స‌ర్కారు ఏర్ప‌డుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. వాస్త‌వానికి స్వీట్లు పంచిపెట్టుకొని.. సంబ‌రాలు షురూ చేశారు కూడా. కానీ.. ఓట్ల లెక్కింపులో ప‌ద‌కొండు గంట‌ల త‌ర్వాత మొద‌లైన అనుమానం.. పన్నెండు గంట‌ల‌కు ఫిక్స్ కావ‌ట‌మే కాదు.. ఒంటి గంట గ‌డిచేస‌రికి బీజేపీ నేత‌ల‌కు క‌రెంటు షాక్ కొట్టిన ప‌రిస్థితి. ప్ర‌భుత్వం ఏర్పాటు ప‌క్కా అనుకున్నోళ్లు సైతం అవాక్కైన దుస్థితి.

చేతి వ‌ర‌కూ రావ‌ట‌మే కాదు.. నోటి దాకా వ‌చ్చింద‌నుకున్న బంద‌రు ల‌డ్డూ లాంటి ప‌వ‌ర్.. చేజారిపోవ‌టాన్ని క‌మ‌ల‌నాథులు జీర్ణించుకోలేక‌ పోతున్నారు. దీంతో.. కాంగ్రెస్‌.. జేడీఎస్ స‌ర్కారును ఏదోలా దెబ్బ తీయాల‌న్న ప్ర‌య‌త్నాల్ని చేస్తూనే ఉన్నారు. మొన్న‌టికి మొన్న అధికార ప‌క్ష ఎమ్మెల్యేల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ను ప్ర‌యోగించినా వ‌ర్క్ వుట్ కాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సోద‌రుడు రేవ‌ణ్ణ‌ను బీజేపీ నేత‌లు భేటీ అయిన వీడియో క్లిప్పింగ్ ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. సంకీర్ణ స‌ర్కారులో సూప‌ర్ సీఎంగా పేరొందిన కుమార‌స్వామికి సొంత సోద‌రుడే షాకిస్తారా? అన్న సందేహం క‌లిగేలా ఒక వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చి వైర‌ల్ గా మారింది. బీజేపీ కీల‌క నేత శోభాక‌రంద్లాజేతో సీఎం సోద‌రుడు ఎందుకు భేటీ అయ్యారు? వారి మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ ఏమిటి? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఈ భేటీ వ్య‌వ‌హారం ఒక‌వైపు క‌ల‌క‌లం రేపుతుండ‌గా.. మ‌రోవైపు మంత్రి పుట్ట‌రాజు మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌ తో కంటే బీజేపీతో క‌లిస్తే మ‌రింత ప్ర‌యోజ‌నం క‌లిగేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. ఆప‌రేష‌న్ క‌మ‌ల పేరుతో క‌ర్ణాట‌క‌లో ఏదోలా కాషాయ‌జెండా అధికారిక హోదాలో ఎగ‌రాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న మోడీషాలు త‌మ‌కున్న ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌లట్లేదు. దీంతో..కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని మార్చేసేందుకు భారీ ఎత్తున ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఎవ‌రేం అనుకుంటే మాకేంటి?. అధికారంలోకి రావ‌ట‌మే లక్ష్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీని కుమార‌స్వామి అండ్ కోలు ఎలా నిలువ‌రిస్తారో చూడాలి.