Begin typing your search above and press return to search.

బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్‌..ఇపుడిదే హాట్

By:  Tupaki Desk   |   2 March 2017 2:29 PM GMT
బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్‌..ఇపుడిదే హాట్
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి - రాష్ట్ర సర్కార్‌ ను నడుపుతున్న టీఆర్‌ ఎస్‌ నేతల మద్య మాటల యుద్దం నడుస్తోంది. ఓ వైపు బీజేపీ నేతలు మరో వైపు తెలంగాణ మంత్రులు చేస్తున్న వాదోపవాదాలతో రెండు పార్టీల మద్య మాటల తుటాలు పేలుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్‌ ను పెంచేందుకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారు. అందులో బాగంగా తెలంగాణపై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్ని బలహీనంగా తయారుకావడంతో రాష్ట్రంలో కమలం పార్టీని విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా టీఆర్‌ ఎస్‌ పై విమర్శల దాడిని పెంచారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచాయని, ఈ రెండేళ్లలో తెలంగాణ అభివృద్ది కోసం 96 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించామని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్రంలోని టీఆర్‌ ఎస్‌ సర్కార్‌ దుర్వినియోగం చేస్తుందని తమ ప్రభుత్వ డబ్బులను పేదలకు అందకుండా చేస్తున్నారని వారు ఆరోపించారు.

తెలంగాణలో టిఆర్‌ ఎస్‌ పాలనపై స్థానిక బీజేపీ నేతలు గత కొద్దిరోజులుగా పోరాటాలు కొనసాగిస్తున్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆ పార్టీ నేతలు ఆందోళనల బాట పట్టారు. కరువు సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోను నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ సహ పలు అంశాలపై ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి సంబందించి రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మించేందుకు సిద్దమైన కేంద్రం ఒక్కో ఇంటికి లక్ష రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణ యిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇళ్ల నిర్మాణాలను చేపట్టకుండా అడ్డు కుంటోందని ఆరోపిస్తున్నారు. కేంద్రం చేపట్టిన పలు పథకాలలో తెలంగాణ పట్టణాలకు చోటు దక్కిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బీజేపీ మద్దతుతోనే జరిగిందంటున్న బీజేపీ నేతలు రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం కోలుకునే పరిస్థితులలో లేదని టీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చి దిద్దేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజా ఉద్యమాల బాటపట్టారు.

నాలుగు రోజుల పాటు సింగరేణి ప్రాంతంలో పర్యటించిన బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్షనేత‌ కిషన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులకు ప్రతత్యేక గుర్తింపు ఉందన్నారు. వారికిచ్చిన అన్ని హమీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అదే సంద‌ర్భంలో టీఆర్‌ఎస్‌ రెండేళ్ల పాలనపైన ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. ఎంఐఎం నేతల అరాచకాలకు టీఆర్‌ఎస్‌ నేతలు వంత పాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో బీజేపీ పాలనలో రాష్ట్రాలు అభివృద్దిలో దూసుకుపోతున్నాయని, మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ మాత్రం రోజు రోజుకు దిగజారుతుందన్నారు. ఇంత తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు ప్ర‌భుత్వంపై విరుచుకుపడడంతో టీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు. తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రమ‌ని చెబుతూనే అభివృద్దికి కేంద్రం సహాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ లో కలపడం వల్ల సీలేరు నుండే వచ్చే నాలుగు వందల యాబై యూనిట్ల విద్యుత్‌ ను తెలంగాణ కోల్పోయిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికి ఇప్పటికి హైకోర్టు విభజన పూర్తి చేయలేదని గుర్తుచేస్తున్నారు. ఉద్యోగుల విభజనతో పాటు రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదన్నారు. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారమే కేంద్రం నుండి అన్ని రాష్ట్రాల‌కు ఇచ్చిన విదంగానే తెలంగాణకు కూడ ఇచ్చారని ప్రత్యేకంగా ఇచ్చినవి ఏమి లేదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో పేర్కొన్న విదంగా ఎయిమ్స్‌తో పాటు పలు విద్యాలయాలను ప్రకటించడంలో కేంద్రం ఆలస్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు తాము కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అలసత్వం పై ప్రశ్నిస్తుంటే తప్పుడు సమాధానాలు చెబుతూ బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న హమీల అమలు కోసం తాము మరో ఉద్యమానికి సిద్దమవుతామని తెలంగాణ మంత్రులు హెచ్చరించారు. కాగా, ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మద్య సఖ్యత చెడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/