Begin typing your search above and press return to search.

డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఆ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   23 July 2018 5:55 AM GMT
డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఆ ఎమ్మెల్యే!
X
ఆయనో ఎమ్మెల్యే... చిన్నతనంలో బాధ్యతల కారణంగా పెద్దగా చదువుకోలేదు. ఆ తరువాత రాజకీయాల్లోకి రావడంతో చదువుకునే సమయం చిక్కలేదు. కానీ, కనీసం డిగ్రీ అయినా చదవకుండా ఎమ్మెల్యేగా ఉండడం బాగులేదనిపించింది ఆయనకు.. ప్రజాప్రతినిధికి కనీస చదువు అవసరంఅనుకున్నారు. ఇంకేముంది... సమయం చిక్కించుకుని మరీ డిగ్రీ చదువుతున్నారు. కుమార్తెల ప్రోత్సాహం కూడా తోడవడంతో బాగా చదివి బీఏ పరీక్షలు కూడా రాశారు. తాను చదువుకుంటూనే మారమూల పల్లెల్లో చదువుకు దూరమవుతున్న ఎంతోమంది బాలికల్ని బడికి పంపించేలా వినూత్న కార్యక్రమాలను చేపడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్ రూరల్ ఎమ్మెల్యే పూల్ సింగ్ మీనా.

మీనా చిన్నతనంలో ఆయన తండ్రి మరణించడంతో అర్థాంతరంగా చదువు ఆపేసి.. వ్యవసాయం చేసి కుటుంబానికి అండగా నిలబడ్డారు. తర్వాత రాజకీయ నేతగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు పెరిగిపోవడంతో చదువు సంగతే మర్చిపోయారు. అప్పుడే ఆయన కూతుర్లు చదువు గొప్పతనం గురించి చెప్పి.. ఆయన్ను ప్రోత్సహించారు. కూతుళ్ల ప్రోత్సహంతో 2013లో ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ పూర్తి చేశారు.

ఆ తర్వాత మళ్లీ చదువుకు బ్రేకులు పడ్డాయి. మూడేళ్ల తర్వాత 2016లో మళ్లీ 12వ తరగతి చేరి.. 2017లో పాసయ్యారు. మళ్లీ ఈ ఏడాదిలో డిగ్రీ చేరి.. మొన్నే పరీక్షలు కూడా రాశారు. తాను చదుకుంటూ తన నియోజకవర్గంలో గిరిజన బాలికల చదువు కోసం కృషి చేస్తూ.. వినూత్న కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. సెకండరీ, హయ్యర్ సెకండరీ పరీక్షల్లో 80శాతం కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే.. ఆ బాలికల్ని విమానంలో ఉచితంగా జైపూర్ తీసుకెళతామని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం 2016లో ఇద్దరు.. 2017లో ఆరుగుర్ని అలాగే జైపూర్ తీసుకెళ్లారు. అక్కడ సీఎం చేతులమీదుగా సన్మానించి.. అసెంబ్లీ సందర్శనకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి బాలికలు చాలా కష్టపడి చదువుతున్నారు. బడికి వెళుతున్న అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిందట. ఇలా బాలికల్ని ప్రోత్సహిస్తూనే తాను కూడా డిగ్రీ పూర్తి చేస్తున్నానని చెబుతున్నారీ ఎమ్మెల్యే.