Begin typing your search above and press return to search.

అంత‌టి కంచుకోట‌ను కోల్పోయిన బీజేపీ!

By:  Tupaki Desk   |   23 May 2019 9:13 AM GMT
అంత‌టి కంచుకోట‌ను కోల్పోయిన బీజేపీ!
X
మోడీకి ఎదురులేని ప‌రిస్థితి. ఆయ‌న‌తో క‌లిసి న‌డిచిన‌వారంద‌రికి భారీ ప్ర‌యోజ‌నాన్ని పొందిన ప‌రిస్థితి. మోడీ గాలి దేశంలో ఎంత‌లా వీస్తుంద‌న్న విష‌యం తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఉత్త‌వే అన్న విప‌క్షాల నోటికి తాళం వేసేలా.. ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. అంచ‌నాల‌కు మించిన ఎన్డీయే కూట‌మి దూసుకెళుతోంది.

ప‌శ్చిమ‌బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే బీజేపీ గ‌తానికి మించి బ‌ల‌ప‌డిన వైనం తాజా ఫ‌లితాల‌తో స్ప‌ష్ట‌మైంద‌ని చెప్పాలి. దీదీకి ద‌డ పుట్టేలా ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టం సామాన్య‌మైన విష‌యం కాద‌ని చెప్పాలి. ప‌శ్చిమ‌బెంగాల్ లో మొత్తం 42 స్థానాలు ఉంటే తృణ‌మూల్ 21 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంటే.. బీజేపీ 19 స్థానాల్లో గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తుండ‌టం మామూలు విష‌యం కాదు.

ఇదొక్క‌టే కాదు.. బీజేపీ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి కావ‌టానికి చాలానే అంశాలు ఉన్నాయి. ఇంత‌టి ఆనందంలోనూ ఒక చిన్న బాధ బీజేపీకి ఎదురైన పరిస్థితి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సంచ‌ల‌న ఫ‌లితాల్ని న‌మోదు చేసిన బీజేపీకి తాను ప‌వ‌ర్లో ఉన్న గోవా అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోవ‌టం బాధించే విష‌యంగా చెప్పాలి. అందునా.. ఆ సీటు మ‌రెవ‌రిదో కాదు.. దివంగ‌త ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారీక‌ర్ ది కావ‌టం విశేషం.

బీజేపీకి కంచుకోటగా చెప్పే ప‌నాజీ స్థానంలో బీజేపీ అభ్య‌ర్థి ఓట‌మిపాల‌య్యారు. బీజేపీ అభ్య‌ర్థిపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి అట‌న‌సియో మ‌న్సెరాటే 1758 ఓట్ల తేడాతో గెలుపొందారు. దాదాపు పాతికేళ్ల నుంచి బీజేపీకి కంచుకోట‌లాంటి ప‌నాజీలో బీజేపీ ఓడిపోవ‌టం ఆ పార్టీని ఇబ్బంది పెట్టే అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.