Begin typing your search above and press return to search.

అయ్యో.. బీజేపీ సాలు దొర‌.. సెల‌వు దొర ఇలా అయిపోయిందేమిటి?

By:  Tupaki Desk   |   12 Aug 2022 8:46 AM GMT
అయ్యో.. బీజేపీ సాలు దొర‌.. సెల‌వు దొర ఇలా అయిపోయిందేమిటి?
X
వచ్చే ఎన్నిక‌ల్లో ద‌క్షిణ భార‌త‌దేశంలో క‌ర్ణాట‌క త‌ర్వాత తెలంగాణ‌లోనూ విజ‌యం సాధించి అధికారంలోకి రావ‌డానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల జ‌డివాన కురిపిస్తోంది. వినూత్నంగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల దాడి చేస్తోంది. ఈ నేప‌థ్యంంలో.. సాలు దొర‌.. సెల‌వు దొర పేరుతో కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొద‌లైయ్యిందంటూ బీజేపీ ప్ర‌చారం చేప‌ట్టింది. అయితే బీజేపీ చేపట్టిన ఈ ప్ర‌చారానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) అడ్డుపుల్ల వేసింది. ఈ ప్ర‌చారంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

సీఎం కేసీఆర్ త‌న ఎనిమిదేళ్ల ప‌రిపాల‌న‌లో భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సాలు దొర‌.. సెల‌వు దొర పేరుతో భారీగా హైద‌రాబాద్ న‌గ‌రంతోపాటు ప‌లుచోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలు, గతంలో చేసిన ప్రకటనలు పొందుపరుస్తూ ఫ్లెక్సీలు పెట్టింది.

ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య, జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూపంపిణీ, అందరికి దళిత బంధు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను గుర్తు చేస్తూ.. హామీలు అమలు చేయని 'సాలు దొర.. సెలవు దొర అంటూ బ్యానర్లు కట్టి బీజేపీ వైరల్ చేసింది. ఇవి సోష‌ల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీనికి కౌంట‌రుగా టీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని విమ‌ర్శిస్తూ హోర్డింగులు, ఫ్లెక్సీల‌కు తెర తీశారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఫొటోలతో పోస్టర్లు ముద్రించేందుకు బీజేపీ అనుమతి కోరగా కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ శ్రేణులు టీఆర్ఎస్, కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల దాడికి వేటిని ల‌క్ష్యంగా చేసుకుంటారో వేచిచూడాల్సిందే.

కాగా ఇటీవ‌ల కాలంలో టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు వాడీవేడి పెరిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని, కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వ ప‌రిపాల‌నను ల‌క్ష్యంగా చేసుకుని కేసీఆర్ విమ‌ర్శ‌లు చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత‌లు కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దునుమాడుతున్నారు. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల సంద‌ర్భంగా ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌ను విమ‌ర్శిస్తూ టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీనికి కౌంట‌రుగా బీజేపీ నేత‌లు కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకుని ప‌లుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇప్పుడు తాజాగా బీజేపీ ప్ర‌చారానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ్రేక్ వేయ‌డంతో మ‌రి కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉందంటున్నారు.