Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర ఎన్నికలకూ.. భారతరత్నకు సంబంధం ఏమిటబ్బా!

By:  Tupaki Desk   |   17 Oct 2019 1:30 AM GMT
మహారాష్ట్ర ఎన్నికలకూ.. భారతరత్నకు సంబంధం ఏమిటబ్బా!
X
'మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే సావర్కర్ కు భారతరత్న ఇస్తాం..' ఇదీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీ. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ హామీని ఇచ్చింది. అయితే వినడానికి ఇది చాలా వింతగా ఉంది. కాస్త ఆలోచిస్తే ఇదేం హామీనో - ఇందులో కామెడీ ఏమిటో అర్థం అవుతుంది.

ఎందుకంటే.. భారతరత్నగా ఎవరిని ప్రకటించాలన్నా అది కేంద్రం చేతిలోని పని. బీజేపీకి అధికారం దక్కాకా భారతరత్నాలుగా పలువురిని ప్రకటించారు. అందులో భాగంగా ఆర్ ఎస్ ఎస్ వ్యక్తి ఒకరికి కూడా ఆ హోదాను ప్రకటించేశారు. అలాంటప్పుడు వీర సావర్కర్ ను భారతరత్న అంటూ ప్రకటించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు.

ఆ ప్రకటనకూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకూ ఎలాంటి సంబంధం లేదు.మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. సావర్కర్ కు బీజేపీ వాళ్లు ప్రకటించాలనుకుంటే భారతరత్నగా వెంటనే ప్రకటించుకోవచ్చు. అయితే.. బీజేపీ వాళ్లు అలాంటి పని చేయడం లేదు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే సావర్కర్ కు భారతరత్న అట. లేకపోతే లేదన్నట్టుగా బీజేపీ ఎన్నికల హామీ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న వేళ తమ చేతిలోని పనికి కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను వాడుకుంటోంది బీజేపీ. మరి ఇలాంటి విషయాన్ని మరాఠీలు ఎలా తీసుకుంటారో!