Begin typing your search above and press return to search.

ఆపరేషన్ ఏపీ.. బీజేపీ ప్లాన్ ఇదే..

By:  Tupaki Desk   |   6 Jun 2019 6:17 AM GMT
ఆపరేషన్ ఏపీ.. బీజేపీ ప్లాన్ ఇదే..
X
ఆపరేషన్ ఏపీ.. ఇప్పుడు బీజేపీ పెద్దలు తలపెట్టిన ప్రాజెక్టు.. ఏపీలో పూర్తిగా దెబ్బతిన్న బీజేపీని వచ్చే 2024 వరకు కనీసం ప్రతిపక్షంగానైనా నిలబెట్టాలన్నది కేంద్రంలోని బీజేపీ పెద్దల అభిలాష. ఇందుకోసం వారు ప్రధానంగా టార్గెట్ చేస్తోంది టీడీపీనే...

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం బీజేపీకి మెజార్టీ తగ్గినా.. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని ఫినిష్ చేయాలని చంద్రబాబు వేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు.. బెంగాల్ నుంచి కర్ణాటక, యూపీ వరకు ప్రతీ రాష్ట్రం వెళ్లి మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు రాజకీయం చేశారు. కానీ చివరకు ఆయనే ఘోరంగా ఓడి ఇప్పుడు ఏపీలో ఉనికి కోల్పోయారు. ఇప్పుడు దారుణంగా ఓడిన టీడీపీని ఏపీలో లేకుండా చేయాలని.. పూర్తిగా తుడిచిపెట్టేయాలని బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపట్టిందని తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాటలను బట్టి అర్థమవుతోంది..

తెలుగు వ్యక్తి అయిన రాంమాధవ్ బీజేపీలో కీలక నేత.. ఈశాన్య రాష్ట్రాల్లో లేని బీజేపీని ఇన్ చార్జీగా తీసుకొని అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా పేరుంది. పలు హిందీ రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుపునకు దోహదపడ్డారు. అందుకే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఏపీలో బలపడడం కోసం అవసరమైతే ప్రత్యేకహోదాపై మోడీతో చర్చించి సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తామని తాజాగా రాంమాధవ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో బీజేపీ దెబ్బతినడానికి హోదా ఇవ్వడం లేదని టీడీపీ చేసిన ప్రచారమే కొంప ముంచిందని విశ్లేషించాడు. హోదా ఇవ్వకపోవడం వల్లే బీజేపీ ఏపీలో పూర్తిగా దెబ్బతిన్నదని.. బీజేపీ మోసం చేసిందన్న వాదనను టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. అయితే టీడీపీ ఇప్పుడు ఏపీలో నామరూపాలు లేకుండా పోవడంతో బాబు వాదనను ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. త్వరలోనే జగన్ ఆశించినట్టు హోదాపై ప్రధానితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 14 వ ఆర్థిక సంఘం సలహా మేరకు ఆనాడు హోదా ఇవ్వలేదని.. ఇప్పుడు ఆలోచిస్తామని రాంమాధవ్ చెప్పడంతో మళ్లీ ఏపీకి హోదా ఆశలు రేగాయి. మరి బీజేపీ బలపడడం కోసమైనా ఏపీకి హోదా ఇస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఆపరేషన్ ఏపీతో అటు హోదా ఇవ్వడం.. బీజేపీ బలపడడం.. టీడీపీని దెబ్బతీయడం లక్ష్యంగా కమళదళం వెళుతుందని అర్థమవుతోంది.