Begin typing your search above and press return to search.

జ‌మ్మూక‌శ్మీర్‌ పై కొత్త ప్లాన్‌..ఇక దూకుడే

By:  Tupaki Desk   |   6 July 2018 1:56 PM GMT
జ‌మ్మూక‌శ్మీర్‌ పై కొత్త ప్లాన్‌..ఇక దూకుడే
X
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకోవడంతో జమ్ముకశ్మీర్‌ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగ‌తి తెలిసిందే. పీడీపీతో మూడున్నరేళ్ల‌ పాటు సాగిన పొత్తుకు జూన్ 19న బీజేపీ గుడ్‌ బై చెప్పడంతో... ఆ రాష్ట్రంలో ఏం జ‌రగ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. రంజాన్ తర్వాత కూడా కశ్మీర్‌ లో కాల్పుల విరమణను కొనసాగించాలని సీఎం మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేయగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో రెండు పార్టీల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు - మంత్రులు.. అమిత్ షాతోపాటు ఇతర అధిష్టాన పెద్దలను కలిశారు. అనంత‌రం జమ్ముకశ్మీర్‌ లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చేసింది. పీడీపీతో కలిసి సాగడం ఇక బీజేపీ వల్ల కాదని - అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి - జమ్ముకశ్మీర్ ఇన్‌ చార్జ్ రాంమాధవ్ వెల్లడించారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ పాల‌న సాగుతోంది.

కాగా, జమ్మూకశ్మీర్‌ లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. 87 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌ లో పీడీపీకి 28 మంది - బీజేపీకి 25 ఎమ్మెల్యేల బలం ఉంది. పీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు - స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అమర్‌ నాథ్ యాత్ర ముగిసిన తర్వాతే జమ్మూకశ్మీర్‌ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు పలు రాజకీయ సమీకరణాల దృష్ట్యా గవర్నర్ ఎన్‌ ఎన్ వోహ్రను కూడా మార్చే అవకాశం ఉంది.

ప్ర‌భుత్వం ప‌డిపోయేందుకు ముందు కూడా బీజేపీ-పీడీపీల మ‌ధ్య అనేక ద‌ఫాలు విబేధాలు ఏర్పాడ్డాయి. కథువా రేప్ కేసు విషయంలో నిందితులకు మద్దతుగా బీజేపీ మంత్రులు ర్యాలీ నిర్వహించినపుడు కూడా ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని పీడీపీ హెచ్చరించింది. కాల్పుల విరమణ విషయంలో రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. రంజాన్ ముగిసిన మరుసటి రోజే కాల్పుల విరమణను కేంద్రం విరమించుకుంది. జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్య - జవాను ఔరంగజేబ్ కిడ్నాప్ - హత్యలతో కేంద్రం కాల్పుల విరమణను పొడిగించేందుకు నిరాకరించింది. ఈ ప‌రిణామాల‌న్నీ..పొత్తుల‌కు గుడ్ బై చెప్పే స్థాయికి చేరింది.