Begin typing your search above and press return to search.

60 సీట్లు ఎలా వ‌స్తాయి ఈటెల‌..!

By:  Tupaki Desk   |   2 July 2022 3:30 PM GMT
60 సీట్లు ఎలా వ‌స్తాయి ఈటెల‌..!
X
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ అతిగా ఊహించుకుంటున్నారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ లో 60 సీట్లు సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం సాధ్య‌మేనా..? అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. టీఆర్ఎస్ ప‌ని అయిపోయింద‌ని.. కాంగ్రెస్ లేవ‌లేద‌ని.. ఇక వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని ఈటెల ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ అంశంపై రాజ‌కీయ విశ్లేష‌కులు ఆస‌క్తికర వాద‌న‌లు వినిపిస్తున్నారు.

తెలంగాణ‌లో అధికార పార్టీ గ్రాఫ్ త‌గ్గింద‌నేది ఒప్పుకోవాల్సిన వాస్త‌వం. వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు అధికారంలో ఉండ‌డం.. కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం స‌హ‌జంగా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచేదే. సొంత పార్టీ నుంచి ఈటెల‌ను బ‌య‌టికి పంపించ‌డం.. ఉద్య‌మ‌కారుల‌ను అంద‌లం ఎక్కించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మే. తెలంగాణ సెంటిమెంటు ప‌క్క‌కు పోవ‌డం.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దివాళా తీస్తుండ‌డం ఆందోళ‌న‌క‌ర‌మైన అంశ‌మే.

అయితే.. వీట‌న్నింటినీ అధిగ‌మించి తిరిగి అధికారం సొంతం చేసుకోవ‌డం కేసీఆర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స‌ల‌హాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 50 శాతం మందికి తిరిగి టికెట్ ఇవ్వ‌బోర‌ని తెలుస్తోంది. వీరి స్థానాల్లో స‌మ‌ర్థులు, యువ‌త‌, ఉద్య‌మ కారులు, ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి ఉన్న‌వారికి టికెట్లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ట‌. ఎన్నిక‌ల లోగా కొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేయ‌డం.. స‌రికొత్త రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌జ‌లకు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

క్రితం ఎన్నిక‌ల్లో సాధించినన్ని సీట్లు రాక‌పోయినా.. కొద్దిగా త‌గ్గినా ప‌ర్వాలేద‌నే ఆలోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నార‌ట‌. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య చీలిపోయి స్వ‌ల్ప మెజారిటీతో అయినా గ‌ట్టెక్కుతామ‌నే ధీమాలో ఉన్నార‌ట‌. మ‌రో వైపు అంతే బ‌లంగా రేవంత్ రూపంలో కాంగ్రెస్ దూసుకొస్తోంది. ఆ పార్టీలో అస‌మ్మ‌తి వాదం ఉన్నా.. కొత్త నాయ‌క‌త్వాన్ని ఎద‌గ‌నీయ‌క‌పోయినా.. ఇప్ప‌టికీ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ బ‌లంగా ఉంది. ఇందులో భాగంగా ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌లు మొద‌ల‌య్యాయి. పైగా రేవంత్ దూకుడు కూడా తోడైతే గణ‌నీయ‌మైన సీట్ల‌నే సాధించే అవ‌కాశం ఉంది. ప‌లు స‌ర్వేలు ఇప్ప‌టికీ ఇదే చెబుతున్నాయి.

మ‌రి.. ఏ ధీమాతో బీజేపీ 60 సీట్లు సాధిస్తామ‌ని చెప్పుకుంటుందో అర్థం కావ‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కేవ‌లం మోదీ బొమ్మ‌తోనే ఓట్లు రాల‌వ‌ని.. సంస్థాగ‌తంగా ఆ పార్టీ బ‌లంగా ఉంటేనే సాధ్య‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పైగా ఆ పార్టీపై అన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై రైల్వే, సింగ‌రేణి, ఇత‌ర ప్ర‌భుత్వ రంగ ఉద్యోగులు ఉద్య‌మిస్తున్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం మాదిగ‌లు పోరాడుతున్నారు.

అలాగే.. కొత్త సాగు చ‌ట్టాల‌తో రైతులు వ్య‌తిరేకం అయ్యారు. జీఎస్టీ, పెట్రో, గ్యాస్‌, వంట నూనె ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో వాహ‌న‌దారులు, గృహిణులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌రి ఇంత‌టి ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య 60 సీట్లు సాధించి ఎలా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆ పార్టీకి ప‌ట్టున్న అర్బ‌న్ స్థానాల్లో, మ‌రికొన్ని చోట్ల క‌లిపి కేవ‌లం 10 నుంచి 20 వ‌ర‌కే ప‌రిమితం అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ విష‌యం ఈట‌ల రాజేంద‌ర్ కు కూడా తెలియ‌నిది కాదు. కాక‌పోతే మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. చూడాలి మ‌రి ఆ పార్టీ మేజిక్ ఫిగ‌ర్ కు ఎలా చేరువ‌వుతుందో..!