Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేకు ఇల్లు కట్టిస్తున్న ప్రజలు

By:  Tupaki Desk   |   29 Jan 2019 10:25 PM IST
ఎమ్మెల్యేకు ఇల్లు కట్టిస్తున్న ప్రజలు
X
సాధారణంగా మనకు ఎమ్మెల్యే అనగానే.. ప్రజల సొమ్ముని జలగలా పీల్చేస్తున్నవాళ్లే గుర్తుకువస్తారు. లేదంటే.. ప్రజల, ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేస్తున్న ఎమ్మెల్యేల గురించి ఇప్పటివరకు విని ఉంటాం. కానీ ఒక ఎమ్మెల్యే కోసం నియోజకవర్గ ప్రజలే చందాలు వేసుకుని మరీ ఇల్లు కట్టిస్తున్నాంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు.

వివరాల్లోకి వెళ్తే.. మొన్న మధ్యప్రదేశ్‌ లో ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో షియోపూర్‌ జిల్లా విజయ్‌ పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీతారామ్ ఆదివాసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి ఆయన దగ్గర ఇల్లు కూడా లేదు. ఉంటున్న గుడిసె కూడా ప్రజలు ఇచ్చిందే. సీతారామ్‌ ఆదివాసి ఎమ్మెల్యేగా గెల్చినప్పుడు ప్రజలంతా ఆయనకు తులాభారం వేశారు.. ఆ డబ్బులతో ఒక పూరి గుడిసె నిర్మించుకున్నారు. ఆ గుడిసెలో సీతారామ్‌ - ఆయన భార్య ఉంటారు. ఇప్పుడు సీతారామ్‌ కుటుంబం ఊరికి దూరంగా ఉన్న మురికివాడలో ఉంటోంది. ఆయన గుడిసె ఉన్న ప్రాంతం మొత్తం చెత్తతో ఉంటుంది. దీంతో.. నియోజక వర్గ ప్రజలు ఆయన కష్టాన్ని చూడలేకపోయారు. అందరూ చందాలేసుకుని మరీ ఇప్పుడు సీతారామ్‌ ఆదివాసికి రెండు గదుల ఇల్లు కట్టిస్తున్నారు. ఇంటికోసం రూ.100 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వకముందు నుంచే సీతారామ్ ఆదివాసికి మంచి పేరుంది. చాలా క్రమశిక్షణ - నిజాయితీ గల వ్యక్తిగా సీతారామ్‌ ని గుర్తిస్తారు. అందుకే.. బీజేపీ టిక్కెట్‌ ఇచ్చింది. మంచి మెజారిటీతో కూడా గెలుపొందాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఇంకా మొదటి జీతం అందుకోలేదు. అందుకే ఇంకా గుడిసెలోనే ఉంటున్నాడు. ఇది చూడలేని నియోజక వర్గాల ప్రజలు ఆయన కోసం ఇల్లు కట్టిస్తున్నారు. జీతం రాగానే ఆ సొమ్ముని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తానని చెప్తున్నాడు సీతారామ్‌. నిజంగా సీతారామ్‌ ఆదివాసి లాంటి ఎమ్మెల్యేలు ఈ రోజుల్లో కూడా ఉండడం నిజంగా గర్వించదగ్గ విషయమే.