Begin typing your search above and press return to search.

వానల కోసం బురద స్నానం చేసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   14 July 2022 2:30 PM GMT
వానల కోసం బురద స్నానం చేసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఎక్కడంటే?
X
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాంటి నమ్మకాలు.. ఆచారాలు ఉంటాయి. సకాలంలో వానలు కురవక.. వరుణదేవుడి జాడ లేని వేళ.. కప్పలకు పెళ్లి చేయటం లాంటివి చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అలవాటైన ఆచారానికి భిన్నంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాంటి నమ్మకాలు ఉంటాయి. తాజాగా అలాంటి నమ్మకమే ఒకటి యూపీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి.

తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో వర్షాల కోసం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు భారీ సాహసమే చేశారు. యూపీలోని మహారాజ్ గంజ్ జిల్లాలో వర్షాలు కురవాలని.. వరుణుడికి తమపై అనుగ్రహం కలగాలని కోరుకున్నారు.

ఇందులో భాగంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియాకు.. నగర్ పాలిక క్రిష్ణ గోపాల్ జైస్వాల్ కు బురదతో స్నానం చేయించారు. పాటలు పాడి.. తమకు వెంటనే వర్షాలు కురిపించాలని వేడుకున్నారు.

సాధారణంగా ఇలాంటివి చేయటానికి సామన్యుల్ని వాడేస్తుంటారు. అందుకు భిన్నంగా ప్రజల కోరికకు తగ్గట్లు.. వారి ఇక్కట్లకు పరిష్కారంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగటం విశేషంగా చెప్పాలి. తమకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేకు బురదతో స్నానం చేయిస్తే వరుణుడు సంతోషిస్తారన్నది నమ్మకంగా వారు చెబుతున్నారు. గడిచిన కొంతకాలంగా వర్షాల జాడ లేక.. వేడి తీవ్రతతో అక్కడి ప్రజలు ఉడికిపోతున్నారు.

వరుణుడ్ని ప్రసన్నం చేసుకోవటానికి బురద స్నానం చేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీగా వారు చెబుతున్నారు. ఒకవైపు దేశంలో పలు రాష్ట్రాల్లో తుపాన్ల కారణంగా భారీ వర్షాలు కురుస్తుంటే.

యూపీలోని మహారాజ్ గంజ్ ప్రాంతంలో మాత్రం వాన జాడ లేకపోవటంపై అక్కడి స్థానికులు తీవ్ర కలత చెందుతున్నారు. మరి.. ఎమ్మెల్యే వారి బురదస్నానానికి వరుణుడు కరుణిస్తాడేమో చూడాలి.