Begin typing your search above and press return to search.

తెలుగు భాష వ‌ద్దంటున్న బీజేపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   29 Dec 2016 7:00 AM GMT
తెలుగు భాష వ‌ద్దంటున్న బీజేపీ ఎమ్మెల్యే
X
ప్ర‌భుత్వ ప‌రిపాల‌న వ్య‌వ‌హారాల్లో ఉండే సంక్లిష్ట‌త‌ - ప్ర‌త్యేక‌త చాలా మందికి గంద‌ర‌గోళం క‌లిగిస్తుంటుంది. అలాంటి అనుభ‌వ‌మే సీనియ‌ర్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు కిషన్‌ రెడ్డికి ఎదురైంది. దీంతో ఏకంగా స‌భ‌లోనే స్పీక‌ర్ మ‌ధుసూద‌న చారి వ‌ద్ద‌ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ‘అధ్యక్షా ఇదేం తెలుగు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇప్పటికైనా అర్థం అయ్యే తెలుగులో బిల్లులు ముద్రించాలని ఆదేశించండి’ అని స్పీకర్‌ను కోరారు.

అసెంబ్లీలో భూసేకరణ బిల్లుపై చర్చ జరిగే సమయంలో బిల్లులో పేర్కొన్న తెలుగు పదాలు కొన్నింటిని కిషన్‌ రెడ్డి చదివి వినిపించారు. పరిచ్ఛేదం - ప్రాధికార సంస్థ - ఇలాంటి మాటలు ఎవరికి అర్థమవుతాయని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా అందరికీ అర్థం అయ్యే తెలుగును ఉపయోగించాలని కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ సులభంగా అర్థం అయ్యేట్టు బిల్లుల్లో భాష ఉండేట్టు చూడండి అంటూ సూచించారు. ఇదిలాఉండ‌గా...భూ సేకరణపై చట్టం చేసే అధికారం రాష్ట్రానికి ఉంది అని రాజ్యాంగంలోని అంశాన్ని చదివి వినిపించేందుకు మంత్రి హరీశ్‌ రావు కళ్లద్దాలు లేక ఇబ్బంది పడ్డారు. కొన్ని వ్యాఖ్యలు చదివి ఇబ్బంది పడుతుండడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి కళ్లద్దాలు అందించారు. హరీశ్‌ రావుకు కనిపించటం లేదంటూ ప్రతిపక్ష సభ్యులు కామెంట్ చేయగా, వయసు పెరుగుతున్నప్పుడు ఇలాంటివి సహజమేనని హరీశ్‌ రావు బదులిచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/