Begin typing your search above and press return to search.

గంజాయిని ప్రోత్సహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   26 July 2022 12:30 AM GMT
గంజాయిని ప్రోత్సహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే
X
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆ ప్రజాప్రతినిధుల నోటికి అదుపులేకుండా పోతోంది. ఇటీవల బీజేపీ నేత నుపూర్ శర్మ ఒక మత ప్రవక్తపై చేసిన కామెంట్స్ దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని షేక్ చేశాయి. అన్ని దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇక్కడ మన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అందరూ వివాదస్పద వ్యాఖ్యలు చేసినవారే. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొందరు బీజేపీ నాయకులకు పరిపాటిగా మారింది.

ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓ వ్యక్తి హత్యకు, దేశంలో హింసకు కారణమయ్యారు మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ. ఇప్పుడు తాజాగా చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మద్యానికి బదులుగా గంజాయి, భాంగ్ ను ప్రోత్సహిస్తే అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలు జరగకుండా ఉంటాయని కృష్ణమూర్తి అన్నారు. ఈనెల 23న మార్వాహి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.

అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలో కూడా చర్చించినట్టు చెప్పారు. మద్యపాన నిషేధంపై ఓ కమిటీ ఏర్పాటు చేయాలని.. గంజాయి, భాంగ్ వినియోగం దిశగా కమిటీ యోచన చేయాలని కోరారు.

బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే .. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని తిరిగి ప్రశ్నించారు. జులై 27న బీజేపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాన చర్చలో ఈ విషయాన్ని లేవనెత్తుతామని ఆయన తెలిపారు.