Begin typing your search above and press return to search.

ఓర్నీ ధైర్యం పాడుకాను.. ఇప్పుడు కూడా రామమందిరం మాటా?

By:  Tupaki Desk   |   5 Aug 2019 10:50 AM GMT
ఓర్నీ ధైర్యం పాడుకాను.. ఇప్పుడు కూడా రామమందిరం మాటా?
X
ఐదేళ్ల పదవీ కాలం కాదు కదా.. దశాబ్దాల తరబడి నిర్ణయాలు తీసుకోవటానికి భయపడిపోయే గత ప్రభుత్వాలకు భిన్నంగా కేవలం వారం వ్యవధిలో రెండు సంచలన నిర్ణయాల్ని తీసుకోవటం ద్వారా మోడీ సంచలనంగా మారారు. ట్రిపుల్ తలాక్ ను నేరంగా తేల్చేయటంతోపాటు.. దానికి తగ్గ చట్టాన్ని అమల్లోకి తెచ్చేసిన మోడీ సర్కారు దశాబ్దాల తరబడి నానుతున్న కశ్మీర్ ఇష్యూను ఒక్క దెబ్బతో తేల్చేశారు. ఆర్టికల్ 370.. 35 ఏలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో పాటు.. జమ్ముకశ్మీర్ ను మూడు ముక్కలు చేసిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

వారంలోనే రెండు సంచలన అంశాలపై నిర్ణయాలు తీసుకున్న మోడీ ప్రభుత్వం తర్వాతి టార్గెట్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కశ్మీర్ విషయంలో ఒక అడుగు ముందుకు పడింది. రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు మామూలుగా ఉండవు. ఆ విషయాన్ని వదిలేస్తున్న బీజేపీ నేతలు పలువురు తమ తర్వాతి టార్గెట్ అయోధ్యలో రామమందిరమేనని వ్యాఖ్యానించటం గమనార్హం.

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కమ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీడియాతో మాట్లాడిన ఆయన 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ రోజు నుంచి కశ్మీర్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని.. ఇష్టం లేకున్నా ఆర్టికల్ 370ను అందరూ అందరూ కచ్ఛితంగా అంగీకరించాల్సిందేనన్నారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లింలు సంతోషంగా ఉన్నట్లుగా చెప్పారు.

తమ తర్వాతి టార్గెట్ అయోధ్యలో రామాలయంగా చెప్పిన రాజా సింగ్.. రాబోయే ఎన్నికలకు ముందే రామాలయానికి నిర్మించి తీరుతామన్నారు. రాజాసింగ్ దూకుడు అక్కడితే ఆగితే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే చెలరేగిపోయిన ఆయన.. అయోధ్యలో రామాలయం.. కాశీలో శివాలయం.. మధురలో శ్రీకృష్ణుడి గుడిని కట్టనున్నట్లుగా చెప్పేశారు. హిందూ ధర్మాన్ని కాపాడటమే తమ లక్ష్యమన్న ఆయన మాటల్ని విన్నప్పుడు.. మరీ ఇంత దూకుడు అవసరమా? అన్న భావన కలుగక మానదు.