Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఎంఐఎం కు కాదు.. తెలంగాణ కు సీఎంగా ఉండండి

By:  Tupaki Desk   |   11 Feb 2020 8:30 AM GMT
కేసీఆర్ ఎంఐఎం కు కాదు.. తెలంగాణ కు సీఎంగా ఉండండి
X
రాజకీయాలు అవసరాలకు అనుగుణంగా ఎటైనా మళ్లుతాయి. అవసరాన్ని బట్టి వాళ్లు వీళ్లతో.. వీళ్లతో జత కట్టి పబ్బం గడుపుకుంటారు. గతంలో కాంగ్రెస్ తో జత కట్టిన ఏఐఎంఐఎం పార్టీ కొన్నేళ్లుగా టీఆర్ఎస్ చెంతకు చేరింది. ఇప్పుడు టీఆర్ఎస్, ఎంఐఎం బంధం బలంగా ఉంది. ఒకరినొకరు సహకరించుకుంటూ రాష్ట్రం లో హవా కొనసాగిస్తున్నాయి. పైకి దూరమని నటిస్తున్నా అన్ని ఎన్నికల్లో ఎంఐఎం అధికార పార్టీ సహకరిస్తోంది. ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు బలంగా చెబుతున్నారు. బీజేపీ ప్రధాన రాజకీయ శత్రువు ఎంఐఎం. బీజేపీ, ఎంఐఎం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉంటుంది.

తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎంఐఎంతో దోస్తీ చేయడాన్ని మండిపడుతున్నారు. ఎంఐఎంకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ను ఆకస్మికంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కలిశాడు. పాతబస్తీ లో లాల్ దర్వాజ లో ఉన్న ప్రముఖ సింహవాహిని మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రధానంగా కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అక్బరుద్దీన్ ఆలయ అభివృద్ధి చేయాలని, దాంతో పాటు మసీదులకు కూడా నిధులు ఇవ్వాలని కోరాడు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండి పడింది.

హిందు దేవాలయాల అభివృద్ధికి నిధులడిగే హక్కు అక్బరుద్దీన్ ఓవైసీకి లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. హిందూ వ్యతిరేక మచ్చ తొలగించుకునేందుకు ఎంఐఎం పార్టీ ప్రయత్నిస్తోందని తెలిపారు. గతంలో హిందువులు, గోవులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధి గురించి అక్బర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలోని మహాంకాళి ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని చెప్పారు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలో భాగంగానే ప్రగతిభవన్‌కు అక్బర్ వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ ఎంఐఎంకు కాకుండా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని ఈ సందర్భంగా రాజాసింగ్ హితవు పలికారు. తన గోషామహల్ నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి సీఎం కేసీఆర్ సమయం ఇవ్వటం లేదని విమర్శించారు. ఎంఐఎం నాయకులకు మాత్రం అడగకుండానే సమయం ఇస్తున్నారని తెలిపారు.