Begin typing your search above and press return to search.

రాజాసింగ్‌ విడుదలయ్యాడు.. నెక్ట్స్‌ ఏంటి?

By:  Tupaki Desk   |   10 Nov 2022 4:43 AM GMT
రాజాసింగ్‌ విడుదలయ్యాడు.. నెక్ట్స్‌ ఏంటి?
X
ఎట్టకేలకు హైదరాబాద్‌లో గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.ప్రివెంటివ్‌ డిటెన్షన్‌(పీడీ) చట్టం కింద తెలంగాణ ప్రభుత్వం ఆయనకు విధించిన ఏడాది నిర్బంధాన్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది.

మహ్మద్‌ ప్రవక్తను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని, విద్వేష ప్రసంగాలతో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని పోలీసులు రాజాసింగ్‌పై ఆగస్టు 25న పీడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాజాసింగ్‌ రెండున్నర నెలలుగా చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం రాజా సింగ్‌ను బీజేపీ నుంచి సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని షోకాజు నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ అరెస్టుపై ఆయన భార్య ఉషాభాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డు రాజాసింగ్‌ నిర్బంధాన్ని సమర్థించింది. ఆయనపై 100కు పైగా కేసులున్నాయని.. ఇది మొదటిసారి కాదని.. విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు. దీంతో ప్రభుత్వం రాజాసింగ్‌ నిర్బంధాన్ని ప్రభుత్వం 12 నెలలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను కూడా సవాల్‌ చేస్తూ ఉషాభాయి సవరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి ఆయనపై నిర్బంధాన్ని కొట్టేసింది.

కాగా హైకోర్టు రాజాసింగ్‌ ను విడుదల చేస్తూ ఆయనకు పలు ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటికి వెళ్లేప్పుడు ర్యాలీలు నిర్వహించవద్దని కోరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ఏ రకమైన మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దు ఆదేశాలు జారీ చేసింది.

కాగా జైలు నుంచి విడుదలయిన రాజా సింగ్‌ కోర్టు ఆదేశాలను అనుసరించి సైలెంట్‌గా ఉంటారా అంటే ఆయన వ్యవహార శైలి తెలిసినవారు అది కష్టమేనంటున్నారు. చాలా సందర్భాల్లో ఆయన పలు వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచారు. ఒక వర్గానికి శత్రువుగా మారారు.

మరోవైపు రాజా సింగ్‌ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవేనని.. తెలంగాణలో హిందుత్వ భావనను పూర్తి స్థాయిలో రెచ్చగొట్టి హిందువులందరినీ తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ఆయనతో ఇలా చేయించిందనే ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి.

జైలు నుంచి విడుదలయిన తర్వాత రాజా సింగ్‌ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అందులో కూడా తాను శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదంతోనే జైలు నుంచి క్షేమంగా బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. తన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన హిందువులు, అనుచరులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా రానున్న రోజుల్లో తన బాట ఏమిటో ఆయన చెప్పకనే చెప్పారు.

కాగా రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ త్వరలో ఎత్తివేసే అవకాశం ఉంది. సస్పెన్షన్‌ ఎత్తివేతపై బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్టు బీజేపీ తెలంగాణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.