Begin typing your search above and press return to search.

టీటీడీ తీరుతో తిరుమల ఆలయానికి చెడ్డపేరు!

By:  Tupaki Desk   |   30 July 2022 12:32 PM GMT
టీటీడీ తీరుతో తిరుమల ఆలయానికి చెడ్డపేరు!
X
టీటీడీ సిబ్బంది తీరుపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. టీటీడీ తీరుతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినడమేగాక.. ఆలయానికి చెడ్డ పేరు వస్తోందని రాజాసింగ్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు.

అలిపిరి టోల్ గేట్ వద్ద ఇటీవల మహారాష్ట్ర భక్తులను అవమానించే రీతిలో శివాజీ విగ్రహం ఉన్న వాహనాన్ని నిలిపివేశారని.. దీంతో ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోందని రాజాసింగ్ విమర్శించారు. సీఎం జగన్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక ఇదివరకూ కూడా రాజాసింగ్ తిరుమల ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల టు తిరుపతి నడిచే వేలాది ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు ఇచ్చే టికెట్లపై అన్యమత ప్రచార ప్రకటనలు దారుణమని విమర్శించారు.. ఆర్టీసీ టికెట్ల వెనుక హజ్, జేరుసలెం యాత్రల ప్రకటనలు ముద్రించి ఉన్న టికెట్లను ఆర్టీసీ అధికారులు తిరుమల భక్తులకు ఇవ్వడం అప్పట్లో దుమారం రేపింది.

వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి వ్యవహారం జరగడంతో ఏపీ , తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తదితరులు నాడు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వమే ఓ మతాన్ని ప్రచారం చేయడానికి ప్రోత్సహిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.

టీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే క్రైస్తవుల ప్రచారం హిందూ పుణ్యక్షేత్రాల్లో చేయడం ఏపీ సీఎం జగన్ కుట్ర అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే పొరపాటున జరిగిందని డిపో మేనేజర్ వివరణ ఇచ్చినా దీన్ని ప్రభుత్వానికి అంటగట్టి బీజేపీ నేతలు మండిపడ్డారు.

ఇప్పుడు మహారాష్ట్ర భక్తులు ఆరాధించే శివాజీ విగ్రహాన్ని తిరుమల పైకి అనుతించకుండా ‘బాయ్ కాట్’ తిరుమల నినదాన్ని ఆ భక్తులు పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. దీనిపై రాజాసింగ్ విమర్శలు గుప్పించారు.