Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ నోట ‘జేసీబీ’ మాట.. భారీ షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

By:  Tupaki Desk   |   20 Feb 2022 4:01 AM GMT
ఫైర్ బ్రాండ్ నోట ‘జేసీబీ’ మాట.. భారీ షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
X
సంచలనం కోసం వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే నేతలు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు. అలాంటి వారి జోరుకు కళ్లాలు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా చర్యల ఆదేశాల్ని జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల వేళ.. దేశ వ్యాప్తంగా రాజకీయం ఎంతలా వేడెక్కిందన్న సంగతి తెలిసిందే. అందరి చూపు ఉత్తరప్రదేశ్ మీద ఉన్న వేళ.. హైదరాబాద్ మహానగరంలోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే కమ్ ఫైర్ బ్రాండ్ నోటికి పని చెప్పటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే జేసీబీలు.. బుల్ డోజర్లు సిద్ధంగా ఉన్నాయంటూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. మరీ.. ఇంత బరితెగింపు ఏందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఓటర్లను నేరుగా భయపెట్టేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు అంతకంతకూ ఎక్కువ అయ్యాయి. ఇలాంటివేళ.. తన వరకు వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజాసింగ్ ను వివరణ కోరారు.

ఈసీ నోటీసుల నేపథ్యంలో తనకు సమాధానం చెప్పేందుకు సమయం కావాలని రాజాసింగ్ కోరారు. అంతే తప్పించి.. సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు షాకిచ్చేలా రెండు చర్యల్ని చేపట్టింది.

అందులో ఒకటి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అదే సమయంలో 72 గంటల పాటు ఎన్నికల సభలు.. సమావేశాలు.. మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని రాజాసింగ్ పై బ్యాన్ విధించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది.

రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల్ని చూస్తే.. ''ఇప్పటికే యూపీలో వేల సంఖ్యలో జేసీబీలను.. బుల్ డోజర్లను యోగి తెప్పించారు. ఆయనకు ఎవరెవరు ఓటు వేయలేదో వారిని ఎన్నికల తర్వాత గుర్తిస్తాం. వారి ఇళ్లకు బుల్ డోజర్లు పంపిస్తాం. జేసీబీ.. బుల్ డోజర్లు ఎందుకు వస్తాయో తెలుసు కదా. యూపీలో ఉండాలనుకుంటున్నారా? లేదా? యోగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి'' అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారటంతో పాటు.. పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాతి రోజునే రాజా సింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో అయినా.. రాజాసింగ్ తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది.