Begin typing your search above and press return to search.

`తాజ్‌ మహల్‌ ను దేశద్రోహులు నిర్మించారు`

By:  Tupaki Desk   |   16 Oct 2017 8:35 AM GMT
`తాజ్‌ మహల్‌ ను దేశద్రోహులు నిర్మించారు`
X
ప్ర‌పంచంలోని వింత‌ల్లో ఒకటిగా....అద్భుత‌మైన నిర్మాణ సంప‌ద‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా...మొగల్ చరిత్రకు తాజ్‌ మహల్ ఓ తార్కాణం. ఇదో అద్భుత కట్టడం. ఇప్పుడీ పాలరాతి సౌధంపై వివాదాస్పద వ్యాఖ్యలు వెల్లువెత్తతున్నాయి. ఆగ్రాలో ఉన్న ఈ కట్టడం..భారతీయ సంస్కృతికి ఓ మచ్చ అని ఉత్తరప్రదేశ్‌ కు చెందిన బీజేపీ నేత సంగీత్ సోమ్ అని అన్నారు. ఆ మాన్యుమెంట్‌ ను దేశద్రోహులు కట్టారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచదేశాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు తాజ్ అందాలను చూసేందుకు ఆగ్రా వస్తుంటారు. కానీ టూరిజం బుక్‌ లెట్ నుంచి ఇటీవల యూపీ ప్రభుత్వం తాజ్‌ మహల్‌ ను తీసివేసింది. దీనిపై దుమారం కూడా చెలరేగింది. పర్యాటకశాఖ ప్రచురణ నుంచి తాజ్‌ను తీసేశారని చాలా మంది ఆందోళన చెందుతున్నారు, అసలు మనం ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం, తాజ్‌ ను కట్టిన షెహజహాన్ తన తండ్రిని చెరశాలలో వేశాడు, హిందువులను ఊచకోత కోయాలని చూశాడు, నిజంగా ఇదే చరిత్ర అయితే, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత సంగీత్ సోమ్ అన్నారు. 2013లో ముజఫర్‌ నగర్‌ లో జరిగిన అల్లర్ల వెనుక సోమ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ హింసలో సుమారు 60 మంది మృతిచెందారు.

గ‌తంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా... ‘‘తాజ్‌ మహల్‌ కు భారత సంస్కృతితోగానీ, వారసత్వంతోగానీ ఎలాంటి సంబంధం లేదు..’’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా ఇటీవ‌ల యూపీ స‌ర్కారు ప్ర‌చురించిన టూరిజం బుక్‌ లెట్‌ లో తాజ్‌ కు స్థానం దక్కకపోవడంతో యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే బుక్‌ లెట్ తయారీలో పొరపాటు జరిగినట్లు రాష్ట్ర మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.