Begin typing your search above and press return to search.

పోయే కాలం ద‌గ్గ‌ర‌కు వ‌స్తే ఇలానే చేస్తారు మ‌రి

By:  Tupaki Desk   |   18 March 2018 9:25 AM GMT
పోయే కాలం ద‌గ్గ‌ర‌కు వ‌స్తే ఇలానే చేస్తారు మ‌రి
X
కొన్నిసార్లు అంతే. ఎవ‌రి గొయ్యి వారే త‌వ్వుకుంటుంటారు. అధికారంలో ఉన్న‌ప్పుడు కిందా మీదా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం రాజ‌కీయ పార్టీల‌కు అల‌వాటే. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు.. తాము అధికారంలో మునిగి తేలి అలిసిపోయామ‌ని.. ఓ ఐదేళ్లు విపక్షంలో ఉంటే హాయిగా విశ్రాంతి తీసుకోవ‌చ్చ‌న్న మాటను చెప్పేవారు. ఇప్పుడా నేత‌లు తీరిగ్గా కూర్చొని తెగ ఫీలైపోతుంటారు.

ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు తామెంత త‌ప్పుగా ఆలోచించామ‌న్న వేద‌న‌తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తాము అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం స‌మీప దూరంలో లేద‌ని తెగ ఫీలైపోతుంటారు.

చేతిలో ఉన్న దాని విలువ అంత త్వ‌ర‌గా అర్థం కాద‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. రాజ‌స్థాన్ లో అధికార ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీ నేత‌లు ఇప్పుడు నేల మీద న‌డ‌వ‌టం లేదు. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు రాజ‌స్థాన్ ప్ర‌జ‌ల‌కు మంట పుట్టేలా చేస్తున్నారు.

ఇప్ప‌టికి అందుతున్న వార్త‌ల ప్ర‌కారం.. త్వ‌ర‌లో జ‌రిగే ఆ రాష్ట్ర సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి దారుణ‌మైన ఓట‌మి త‌ప్ప‌ద‌ని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు అందుతున్నా అధికార‌ప‌క్ష నేత‌ల్లో కించిత్ మార్పు లేక‌పోవ‌టం స‌రి క‌దా.. అధికార మ‌త్తులో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ స‌రికొత్త వివాదాల‌కు తెర తీస్తున్నారు.

తాజాగా అలాంటి ప‌నే చేశారు ఒక బీజేపీ ఎమ్మెల్యే. త‌న అనుచ‌రుల వాహ‌నాల్ని అనుమ‌తించ‌లేద‌న్న సాకుతో ఒక టోల్ గేట్ ఉద్యోగిపై బీజేపీ ఎమ్మెల్యే గూండాగిరికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. వైర‌ల్ గా మారి పార్టీ ప‌రువును బ‌జార్లో పెట్టేసింది.

రాజ‌స్థాన్ లోని బాన్స్ వారా జిల్లా ఉద‌య్ పూర్ రోడ్డుపై ఉన్న టోల్ ప్లాజా వ‌ద్ద‌కు బీజేపీ ఎమ్మెల్యే జీత్ మ‌ల్ కాంత్ వ‌చ్చారు. ఆవేశంతో ఊగిపోతున్న ఆయ‌న‌.. త‌న అనుచ‌రుల వాహ‌నాల‌కు టోల్ వ‌సూలు చేయ‌టం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. అక్క‌డి ఉద్యోగిని కొడుతున్న దృశ్యాలు వైర‌ల్ అయ్యాయి. ఈ వైర‌ల్ వీడియో అధికార‌పక్షంలో క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి.

ఈ గొడ‌వ‌కు సంబంధించిన దృశ్యాలు స్ప‌ష్టంగా ఉన్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ పోలీసులు ఎవ‌రూ రియాక్ట్ కాలేదు. అదేమంటే.. త‌మ‌కు ఎవ‌రూ ఫిర్యాదులు చేయ‌లేద‌ని పోలీసులు చెప్ప‌టంపై రాజ‌స్థాన్ ప్ర‌జ‌ల్లో తీవ్ర మండిపాటు వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తే పార్టీకి న‌ష్టం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. బీజేపీ నేత‌ల వైఖ‌రి చూస్తే.. రాజ‌స్థాన్ లో పార్టీ ప‌రువు.. ప్ర‌తిష్ఠ‌ను స‌మాధి చేస్తున్నార‌ని.. త‌మ చితిని తామే పేర్చుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి.. అధినాయ‌త‌క్వం ఏం చేస్తున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి