Begin typing your search above and press return to search.

నెట్లో చూశాక బికినీ అంటే తెలిసిందట!

By:  Tupaki Desk   |   4 Nov 2016 3:05 AM GMT
నెట్లో చూశాక బికినీ అంటే తెలిసిందట!
X
విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివెల్ 2017 నిర్వహిస్తానని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంపై మిత్రపక్షం బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు ఫైరయ్యారు. ఇలాంటి ఫెస్టివెల్స్ నిర్వహించడం సరికాదని, ఇవి మన సంప్రదాయం, సంస్కృతి కాదని ఆయన అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసమంటూ ఇలాంటి ఫెస్ట్ నిర్వహించాలనుకోవడం విడ్డూరమని, మహిళల బికినీలు చూసి పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు మనకు అవసరం లేదని స్ట్రాంగ్ గా స్పందించారు. ఇదే సమయంలో బికినీ గురించి విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బికినీ ఫెస్టివెల్స్ నిర్వహించడంపై పూర్తిగా వ్యతిరేకించిన విష్ణుకుమార్ రాజు... బికినీకి, స్కర్టు కు మధ్య ఉన్న వ్యత్యాసం తాజాగా తెలుసుకున్నారట. ఇంతకాలం ఇవి రెండూ ఒకటేనని ఆయన భావించారట. బికినీ వేరు, స్కర్ట్ వేరు... రెండూ ఒకటే అయితే ఇంగ్లిష్ లో రెండు వేరు వేరు పదాలెందుకుంటాయి అనే సినిమా డైలాగ్ సంగతి కాసేపు పక్కనపెడితే... బికినీ అంటే స్కర్ట్ అనుకున్నానని, నెట్లో చూసిన తర్వాత అసలు విషయం అర్థమైందని అంటున్నారు విష్ణుకుమార్ రాజు.

కాగా, ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికులరోజైన 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు బీ.ఎల్.ఎఫ్. 2017 పేరిట ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫెస్టివల్‌ లో ప్రముఖ పాప్ స్టార్ షకీరా తన అందాలతో కనువిందు చేయబోతోందని, మూడు రోజుల పాటు ఆమె ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ ఈ ఫెస్టివల్‌ను నిర్వహించబోతోంది. ఈ ఉత్సవాన్ని ఆనందోల్లాసాల మధ్య నిర్వహించేందుకు అవసరమైన పది ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలను, తోటలను సందర్శించారు.