Begin typing your search above and press return to search.

నొప్పింపక తానొవ్వక...బీజేపీ తెలివి !

By:  Tupaki Desk   |   16 March 2016 11:30 AM GMT
నొప్పింపక తానొవ్వక...బీజేపీ తెలివి !
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చట్టం అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు త‌మ‌దైన శైలిలో రాజ‌కీయం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్ర‌బాబు నాయుడు స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌గా - ప్ర‌తిప‌క్ష వైసీపీ మ‌ద్ద‌తిచ్చింది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం చ‌ర్చ సంద‌ర్భంగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఏపీకి ఏ ప్ర‌యోజ‌నం చేకూర్చాల్సి ఉన్న అది కేంద్రంలో ఉన్న బీజేపీ వ‌ల్లే అనేది లోక విదితం. అయితే చ‌ర్చ‌ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న త‌మ ఢిల్లీ పెద్ద‌ల‌ను ప్ర‌శ్నించ‌కుండా... గ‌తంలో విభ‌జించిన కాంగ్రెస్‌ నో, స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌ట్లేద‌ని ప్ర‌తిప‌క్ష‌ వైసీపీనో బీజేపీ నాయ‌కులు విమ‌ర్శించ‌డం ఆస‌క్తిక‌రం.

మంత్రి మాణిక్యాలరావు చర్చ సంద‌ర్భంగా మాట్లాడుతూ... అడ్డగోలు విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారేనని మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా తోడ్పాటును, సహకారాన్ని అందిస్తున్నదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసే అంశం విభజన చట్టంలో లేకపోయినా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తొలి కేబినెట్ సమావేశంలోనే ఆ నిర్ణయం తీసుకుని ముంపు మండలాలను ఏపీలో కలిపిందని మాణిక్యాల రావు చెప్పారు. మ‌రో మంత్రి కామినేని శ్రీనివాస్ త‌న ప్ర‌సంగంలో విపక్షంపై విమర్శలు కురిపించారు. వైసీపీ విమర్శలు చేయడం తప్ప నిర్మాణాత్మక సూచనలు చేయడం రాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కలసి రావలసింది పోయి జ‌రుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నదని కామినేని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ కలిసి కట్టుగా పోరాడాలని బీజేపీ ప‌క్ష‌నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. రాష్ట్ర పురోభివృద్ధికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది నొప్పించ‌క తానొవ్వ‌క అన్న‌ట్ల‌గా బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యే మాట్లాడిన తీరు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమ‌లు కోసం గ‌ట్టిగా మాట్లాడితే చర్చలో పాల్గొన్న సంద‌ర్భంగా గ‌ట్టిగా మాట్లాడితే తామెక్క‌డ ఢిల్లీ పెద్ద‌ల దృష్టిలో ప‌డిపోతామో అని బ్యాలెన్స్ చేసుకున్న విధానం. పోల‌వ‌రం ముంపు మండ‌లాల‌ను చ‌ట్టంలో లేకున్నా విలీనం చేశామ‌ని చెప్పుకుంటున్న బీజేపీ నాయ‌కులు అలాగే ప్ర‌త్యేక హోదా - ప్ర‌త్యేక ప్యాకేజీ గురించి ఎందుకు అదే విధంగా చేయ‌లేక‌పోతున్నార‌నే సందేహాలు ప‌లువ‌ర్గాలు లేవ‌నెత్తితే ఏం స‌మాధానం ఇస్తారో మ‌రి.