Begin typing your search above and press return to search.

అక్కడ అన్నీ దొంగ ఓట్లేనట... ?

By:  Tupaki Desk   |   3 Nov 2021 12:30 PM GMT
అక్కడ అన్నీ దొంగ ఓట్లేనట... ?
X
ఎన్నికలు, ఓట్లు, రాజకీయాలు, ఇదే ప్రస్తుతం ఎక్కడ చూసిన సాగుతున్న చర్చ. ఏపీలో లేటెస్ట్ గా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి. వైసీపీ తొంబై వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బీజేపీకి ఇరవై వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. నిజంగా బీజేపీ హిస్టరీలో చూస్తే ఇది మంచి పెర్ఫార్మెన్స్. అయితే అధికార వైసీపీ ఎన్నికలను పూర్తిగా ఫార్స్ గా మార్చిందని, లేకపోతే తమకు ఇంకా బాగా ఓట్లు వచ్చేవని బీజేపీ నేతలు అంటున్నారు. వైసీపీ దొంగ ఓట్లు వేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. పదే పదే ఇదే విషయం పైగా పోలింగ్ రోజు నుంచి అంతా మాట్లాడుతున్నారు అంటే దీని మీద ఆలోచించాల్సిందే.

అసలు వైసీపీ దొంగ ఓట్లు వేసుకుందా, అలాగే గెలిచిందా అంటే అదే నిజమని బీజేపీ నేతలు అనడం విడ్డూరమే. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అయితే దొంగ ఓట్లు ఎలా వేసుకోవాలో వైసీపీ బాగా ప్రాక్టీస్ చేస్తోందని చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఈ ప్రయోగాన్ని మొదలెట్టారని, అక్కడ సక్సెస్ అయినందువల్లనే బద్వేల్ లో కూడా అమలు చేశారని అంటున్నారు. అంతటితో ఆగకుండా పొరుగూర్ల నుంచి జనాలను తెచ్చి ఓట్లు వేయించుకోవడంతో వైసీపీ బాగా ఆరితేరిపోయిందని కూడా మాధవ్ చెబుతున్నారు. రేపటి రోజున ఇదే తీరున ఏపీలో జరిగే జనరల్ ఎన్నికల్లో కూడా గెలిచేందుకు వైసీపీ ప్రయత్నం చేయడం ఖాయమని మాధవ్ చెబుతున్నారు.

తాము బద్వేల్ ఉప ఎన్నికల వేళ నియోజకవర్గం అంతా తిరిగామని, ఎటు చూసినా అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాంటిది ఆ పార్టీ ఎలా గెలుస్తుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే వైసీపీది గెలుపు కానే కాదని చెప్పేస్తున్నారు. సరే బీజేపీ వాదనలో ఎంత వరకూ లాజిక్కు ఉందన్నది పక్కన పెడితే ఎన్నికల్లో అక్రమాలు అన్నవి ప్రతీ సారీ ఎన్నో కొన్ని జరుగుతాయని అంతా అంగీకరిస్తారు. అయితే మాత్రం మొత్తానికి మొత్తం వైసీపీకి పడిన లక్షా 12 వేల ఓట్లూ దొంగ ఓట్లే అనడం దారుణమే కదా. పైగా బద్వేల్ ఓటర్లను కూడా అవమానించినట్లే కదా. ఇక బీజేపీకి బద్వేల్ లో ఉన్న బేస్ ఎంత అన్నది కూడా విశ్లేషించుకున్నపుడు ఆ పార్టీ శక్తికి మించే రెండు పదుల వేల ఓట్లు వచ్చాయని అంతా అంటారు. మరి ఇంత జరిగినా కూడా దొంగ ఓట్లు వేయించుకున్నారు. అక్రమంగా గెలిచారు అని పెడబొబ్బలు పెట్టడమేంటన్నదే చర్చ. బీజేపీ నిజంగా వైసీపీని ఢీ కొట్టాలి అంటే జనంలోకి వెళ్ళి ప్రజా మోదం పొందాలని, అంతే తప్ప ఇలా వర్కౌట్ కాని ఆరోపణలు చేస్తూ నోరు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అన్నదే ప్రశ్న.