Begin typing your search above and press return to search.

మోఢీ : కొలువుల భార‌తం ఏం చెబుతోంది ?

By:  Tupaki Desk   |   16 Jun 2022 1:30 AM GMT
మోఢీ : కొలువుల భార‌తం ఏం చెబుతోంది ?
X
దేశంలో ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్య 40.78 ల‌క్ష‌లు. ఉన్న ఉద్యోగుల సంఖ్య 31.91 ల‌క్ష‌లు. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి తాజాగా మోడీ కొలువుల భ‌ర్తీకి ఎన్నడూ లేని విధంగా ఆస‌క్తి చూప‌డంతో బీజేపీ కి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలే రానున్నాయ‌ని విశ్లేష‌కుల మాట లేదా ఉవాచ‌.

ఎప్ప‌టినుంచో నోటిఫికేష‌న్లు అన్న‌వి లేకుండానే కాలం గ‌డిపేస్తున్న నిరుద్యోగ యువ‌త ఇప్ప‌టి ప్ర‌క‌ట‌న‌ల‌తో కొంత‌లో కొంత కెరియ‌ర్ పై దృష్టి సారించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇదే స‌మ‌యంలో రాష్ట్రాలు కూడా త‌మ ప‌రిధిలో భ‌ర్తీలకు కొన్ని అవ‌రోధాల‌ను క్లియ‌ర్ చేస్తే ఏక‌కాలంలో కేంద్ర మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కావాల్సినంత స్థాయిలో మాన‌వ వ‌న‌రులు దొరికేందుకు అవ‌కాశాలు ద‌క్కుతాయి.

ఇక ఉద్యోగాల భ‌ర్తీలో రాజ‌కీయ జోక్యం అన్న‌ది లేకుండా వీలున్నంత వ‌ర‌కూ ప్ర‌తిభ‌కే ప్రాధాన్యం ఇస్తే ఇంకా మేలు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా నిరుద్యోగ యువ‌తకు వారి ప్ర‌తిభ‌ను అనుస‌రించి పోస్టులు ఇస్తే, అవినీతి లేని పాల‌న‌ను మోడీ అందించేందుకు కృషి చేస్తున్నార‌ని బీజేపీ త‌రుచూ చెప్పే మాట‌ల‌కు ఓ ఊతం లేదా ఓ ఆధారం దొరుకుతుంది.

ఆ విధంగా మోడీ వీలున్నంత వ‌ర‌కూ ప‌రీక్ష‌ల నిర్వ‌హణ పేరిట ఎంట్రీ ఫీజుల దందా సాగించ‌క, సామ‌న్య ప్ర‌జ‌ల క‌ల‌ల‌కు సాకారం ఇచ్చే విధంగా పనిచేయాల్సిన అవస‌రం ఎంతైనా ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌లకు ఇప్ప‌టి నుంచే కొన్ని అస్త్రస‌స్త్రాలూ సిద్ధం చేస్తున్నాయి బీజేపీతో స‌హా ఇత‌ర అనుకూల పార్టీలు. ఆ మేర‌కు దేశంలోనే అతి పెద్ద జాబ్ మేళాకు న‌రేంద్ర మోడీ అనే ప్ర‌ధాని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. పైకి ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్ లా క‌నిపిస్తున్నా లోప‌ల రాజ‌కీయం వేరుగా ఉండ‌నుంది. అయితే ఆయ‌న ఉద్దేశాలు ఎలా ఉన్నా కూడా రానున్న కాలాన ప‌ది ల‌క్ష‌ల పోస్టులు భ‌ర్తీ చేయ‌డం అంటే మాత్రం చిన్న మాట కాదు.

ఎన్నిక‌ల‌కు దాదాపు రెండేళ్ల కాలం ఉన్నందున తెలివిగా మోడీ ఈ ప‌ని చేస్తున్నార‌న్న వాద‌నకూ అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే ధ‌ర‌ల విష‌య‌మై, పెట్రో, డీజిల్ పై విధిస్తున్న ప‌న్ను వ‌డ్డ‌న‌ల విష‌య‌మై అదేవిధంగా మిగ‌తా వ్య‌వ‌స్థ‌ల్లో నెల‌కొన్న అవినీతి విష‌య‌మై దేశ ప్ర‌జ‌లు కోపంతో ర‌గిలిపోతున్నారు. వీటికి విరుగుడుగా మోడీ అత్యంత నేర్పరిత‌నంతో జాబ్ మేళాకు స‌న్న‌ద్ధం అయి ఉంటార‌న్న వాదన ఒక‌టి వినిపిస్తోంది.

ఖాళీలిలా ఉన్నాయి..
రైల్వేలు : 3,03,933
ర‌క్షణ శాఖ (సివిల్ ) : 2,47,502
హోం శాఖ : 1,28,842
రెవెన్యూ : 76,327
తాజాగా ఇచ్చిన జాబితాలు అనుస‌రించి ఈ ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్ప‌టికే నిరుద్యోగ యువ‌త ఉద్యోగాల్లేక చిన్నా చిత‌కా ప‌నులు చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. మోడీ అధికారంలోకి వ‌చ్చాక ఇంత పెద్ద స్థాయిలో ఏ రోజూ జాబ్ నోటిఫికేష‌న్ రాలేదు. ఆ మాట‌కు వ‌స్తే అసలు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ హ‌యాంలో ఇంత‌టి స్థాయిలో ఏ రిక్రూట్మెంట్ లేకుండానే ఎనిమిదేళ్లు గ‌డిచిపోయాయి. ఈ ద‌శ‌లో మోడీ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ప‌ది ల‌క్ష‌ల మంది యువత‌కు ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయి. అయితే దీన్నొక ఎన్నిక‌ల స్టంట్-గానే చూడ‌క, వీలున్నంత వ‌ర‌కూ పోస్టుల భ‌ర్తీకి నిజాయితీతో కృషి చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది.